వయనాడ్ మాటలకందని ప్రళయం.. నేలమట్టమైన గ్రామాలు.. వరదలో కొట్టుకుపోయిన ప్రాణాలు.. సహాయక బృందాలు కూడా తల్లడిల్లిన సంఘటన కేరళలోని వయనాడ్‌లో జరిగింది. కేరళలో కురుస్తున్న భారీ వర్షాలు ఊహకందని పెను విషాదంగా మారింది.
ముందడుగు కేరళ
కేరళలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వయనాడ్ జిల్లాను వరదలు ముంచెత్తాయి. ఈ వరదల వల్ల కొండచరియలు విరిగిపడటం, బురద కొట్టుకురావడంతో 102 మంది జల సమాధి అయ్యారు. ఇప్పటివరకూ 102 మంది మృతదేహాలు దొరికినట్లు కేరళ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ వి.వేణు ప్రకటించారు. 116 మంది తీవ్ర గాయాలపాలై వయనాడ్ జిల్లాలోని పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వందల మంది వరదల్లో గల్లంతయ్యారు. ఈ జల ప్రళయం కేరళను అల్లకల్లోలం చేసింది. జులై 30న అర్థరాత్రి సమయంలో వయనాడ్ జిల్లాలో ఊళ్లకు ఊళ్లు కొండచరియలు, బురద, వరద నీటిలో చిక్కుకుపోయాయి.
వయనాడ్ జిల్లా ఇలా శోకసంద్రంలో మునిగిపోవడం చూసి నెటిజన్లు హృదయవిదారక స్థితిలో స్పందిస్తున్నారు. కేరళలోనే వయనాడ్ జిల్లా అత్యంత సుందరమైన ప్రదేశం. సందర్శకులు వయనాడ్ అందాలను వీక్షించేందుకు భారీగా వెళుతుంటారు. అలాంటి ప్రాంతాలైన వయనాడ్లోని ముండక్కై, చూరల్మల, అట్టమాల, నూల్పూజ గ్రామాలు ప్రస్తుతం విషాదానికి సాక్ష్యాలుగా మిగిలాయి. మళప్పురంలోని చలియార్ నదిలో 11 మంది మృతదేహాలు కొట్టుకొచ్చాయి. కాళ్లు లేని స్థితిలో, చేతులు లేని స్థితిలో, మరికొందరి మృతదేహాలైతే తల లేకుండా మొండెం మాత్రమే నదిలోకి కొట్టుకొచ్చిందంటే ప్రకృతి ఉగ్రరూపం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నదిలోకి కొట్టుకొచ్చిన ఈ 11 మంది మృతదేహాల్లో మూడేళ్ల చిన్నారి కూడా ఉండటం శోచనీయం.
వయనాడ్ జిల్లా మాత్రమే కాదు భారీ వర్షాలు కేరళ రాష్ట్రం మొత్తాన్ని అతలాకుతలం చేశాయి. కేరళలోని 8 జిల్లాలకు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. వయనాడ్ జిల్లాలో వరదలకు బలైపోయిన బాధితులకు సంతాప సూచికగా జులై 30, 31.. ఈ రెండు రోజులను కేరళ ప్రభుత్వం సంతాప దినాలుగా ప్రకటించింది. కేరళకు వెళ్లే పలు రైళ్లు వరదల కారణంగా తాత్కాలికంగా రద్దు చేశారు. 17 రైళ్లను రీషెడ్యూల్ చేశారు.
ఇడుక్కి, త్రిసూర్, పాలక్కడ్, మళ్లపురం, కోజికోడ్, వయనాడ్, కన్నూర్, కాసరగోడ్.. ఈ 8 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ముండక్కై అనే గ్రామం గుర్తుపట్టలేని స్థితిలో ఉంది. ఇళ్లు కూలిపోయాయి. భారీ చెట్లు నేలకొరిగాయి. వాహనాలు కొట్టుకుపోయాయి. ఎక్కడ చూసినా కొండ చరియలు సృష్టించిన భయానక పరిస్థితులే కళ్ల ముందు కనిపిస్తున్నాయి. అర్థరాత్రి అందరూ నిద్రిస్తుండగా, 2 నుంచి 4 గంటల మధ్యలో వయనాడ్ జిల్లాపై కొండచరియలు విరుచుకుపడ్డాయి. మెప్పాడిలో 250 మంది వరదల్లో చిక్కుకుపోయారు. వర్షం పడుతూనే ఉండటంతో సహాయక బృందాలకు ఇబ్బందిగా మారింది. 200 మంది సైనికులు సహాయక చర్యల్లో భాగమయ్యారు.