Tuesday, October 15, 2024
HomeUncategorizedజూనియ‌ర్ వైద్యురాలిపై జ‌రిగింది గ్యాంగ్ రేపా.. ?

జూనియ‌ర్ వైద్యురాలిపై జ‌రిగింది గ్యాంగ్ రేపా.. ?

Date:

ప‌శ్చిమ‌బెంగాల్ కోల్‌క‌తాలో జ‌రిగిన జూనియ‌ర్ వైద్యురాలి అత్యాచార కేసును సిబిఐ ద‌ర్యాప్తు చేస్తోంది. తాజాగా ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మృతురాలిపై సామూహిక అత్యాచారం జరిగి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె మృతదేహంలో అధిక మొత్తంలో వీర్యాన్ని గుర్తించినట్లు తెలుస్తోంది. పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఆ జూనియర్‌ వైద్యురాలు ఆసుపత్రిలో గురువారం రాత్రి విధుల్లో ఉన్నారు. శుక్రవారం ఉదయం ఆసుపత్రి సెమినార్‌ హాలులో అర్ధనగ్న స్థితిలో శవమై కనిపించారు. ఈ కేసులో పోలీసు వాలంటీర్‌ అయిన నిందితుడు సంజయ్‌ రాయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే, ఆమె మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించగా విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

ఆమె రహస్య అవయవాలతో పాటు కళ్లు, నోటి నుంచి బ్లీడింగ్‌ అయిందని.. ముఖం, గోళ్లపై గాయాలతో పాటు కడుపు, ఎడమ కాలు, మెడ, కుడి చేయి, పెదవులు, చేతి వేళ్లపై గాయాలు ఉన్నట్లు నివేదికలో వెల్లడైంది. అత్యంత పాశవికంగా ఆమెపై దాడి చేసి అఘాయిత్యానికి పాల్పడినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఆమె శరీరంలో 150 మిల్లీగ్రాముల వీర్యం ఉన్నట్లు పోస్ట్‌మార్టంలో గుర్తించారట. తమ కుమార్తె మృతిపై ఆమె తల్లిదండ్రులు కోర్టులో వేసిన పిటిషన్‌లో ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పలు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి. దీన్ని బట్టి చూస్తే తమ కుమార్తెపై ఒకరి కంటే ఎక్కువ మంది అత్యాచారానికి పాల్పడి ఉంటారని బాధితురాలి తల్లిదండ్రులు పిటిషన్‌లో ఆరోపించారు.

వైద్య నిపుణులు కూడా ఇదే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ”ఆమె శరీరానికి అయిన గాయాలను చూస్తుంటే ఒక వ్యక్తి మాత్రమే దాడి చేసినట్లు కన్పించట్లేదు. మృతురాలి వ్యక్తిగత అవయవాల్లో 150 మిల్లీగ్రాములు వీర్యం ఉన్నట్లు పోస్ట్‌మార్టం నివేదికలో ఉంది. ఆ మోతాదు కేవలం ఒకే వ్యక్తికి సాధ్యం కాదు. ఇందులో ఎక్కువ మంది దారుణానికి పాల్పడి ఉండొచ్చు” అని అఖిల భారత ప్రభుత్వ వైద్యుల సమాఖ్య అదనపు ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సుబర్ణ గోస్వామి అభిప్రాయపడ్డారు. దీంతో ఆమెపై సామూహిక అత్యచారం జరిగే ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై సీబీఐ కూడా దృష్టి సారించినట్లు సమాచారం.