దేశంలోని చాలా ప్రాంతాల్లో కోచింగ్ సెంటర్లు పూర్తిగా వ్యాపారమయంగా మారిపోయాయని రాజ్యసభ సభ ఛైర్మన్, ఉప రాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలోని ఓ ఐఏఎస్ కోచింగ్ సెంటర్‌లో శనివారం జరిగిన దుర్ఘటన నేడు రాజ్యసభలో స్వల్ప సమయం చర్చకు వచ్చింది. ”ఎప్పుడు న్యూస్ పేపర్ చదువుదామని తెరిచినా రెండు పేజీలు ఈ సంస్థల ప్రకటనలే ఉంటాయి” అని వ్యాఖ్యానించారు. ఈ అంశంపై సభలో స్వల్పకాలిక చర్చ సముచితమని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. దీనిపై అన్ని పక్షాలతో కలిపి ఇన్-ఛాంబర్ మీటింగ్ ఏర్పాటుచేయాలని ఆయన నిర్ణయించినట్లు వెల్లడించారు.
శనివారం సాయంత్రం రావూస్ స్టడీ సర్కిల్‌లోని బేస్‌మెంట్‌లోకి అకస్మాత్తుగా వరద నీరు ప్రవహించడంతో ముగ్గురు విద్యార్థులు తానియా సోని, శ్రేయా యాదవ్, నవిన్ డెల్విన్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై విద్యార్థులు పెద్దఎత్తున ఆందోళన చేపట్టడంతో కోచింగ్ సెంటర్ యజమాని అభిషేక్ గుప్తా, కోఆర్డినేటర్ దేశ్‌పాల్ సింగ్ సహా ఏడుగురిని అరెస్టు చేశారు. ప్రమాదం జరిగిన మూడంతస్తుల భవనం సెల్లార్‌ను స్టోర్ రూమ్, పార్కింగుకు కేటాయిస్తామని ప్రణాళికలో చూపించి గ్రంథాలయంగా ఉపయోగిస్తున్నట్లు తేలిందని పోలీసులు పేర్కొన్నారు. అక్రమంగా నడిపిస్తున్న 13 కోచింగ్ సెంటర్లకు దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సీల్ వేశారు. నిబంధనలకు విరుద్ధంగా కోచింగ్ సెంటర్లు నిర్వహించడం వల్లే చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.