కేసీఆర్ కార్యాలయం ఏర్పాటుకు కొండా లక్ష్మణ్ బాపూజీ స్థలం ఇచ్చి, నిలువ నీడ ఇచ్చారని సీఎం రేవంత్ తెలిపారు. నాంపల్లిలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని(ఐఐహెచ్‌టీ) వర్చువల్‌గా ప్రారంభించారు. లలిత కళాతోరణంలో ఇందుకు సంబంధించిన ప్రారంభోత్సవం నిర్వహించారు. చేనేత అభయహస్తం లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ కోసం పదవులను తృణప్రాయంగా వదులుకున్నారని చెప్పారు. కానీ కొంత మంది రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలు, ఉపఎన్నికలు తెచ్చారన్నారు. ఆ ఎన్నికల్లో సెలక్షన్లు, కలెక్షన్లు చేసి త్యాగమని చెప్పుకొంటున్నారని విమర్శించారు. గజ్వేల్‌లో పాంహౌస్‌లు ఏర్పాటు చేసుకున్నారన్నారు. కేసీఆర్, కొండా లక్ష్మణ్ బాపూజీ త్యాగాలకు తేడా గమనించాలన్నారు. ఉప ఎన్నికల్లో సెలక్షన్లు, కలెక్షన్లతో బాగుపడిందెవరో ప్రజలకు తెలుసన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీని తెలంగాణ ఎప్పుడూ గుర్తిస్తుందని చెప్పారు. ఐఐహెచ్‌టీకీ కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టుకుందామన్నారు.
ఐఐహెచ్‌టీ ఏర్పాటు చేయాలని ప్రధాని, కేంద్రమంత్రులను కోరామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. వారు రాజకీయాలకు అతీతంగా ముందుకు వచ్చి తక్షణమే మంజూరు చేశారని చెప్పారు. నాంపల్లి తెలుగు అకాడమీలో ఐఐహెచ్‌టీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ”గత ప్రభుత్వ హయాంలో చేనేతల జీవన విధానంలో మార్పులు రాలేదు. సిరిసిల్ల నేతన్నలకు బకాయిలు చెల్లించలేదు. కాంగ్రెస్ వచ్చాక వెంటనే వాటిని విడుదల చేశాం. 63 లక్షల మంది స్వయం సహాయక సంఘాల సభ్యులు ఉన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు ఏటా 2 చీరలు ఇవ్వాలని నిర్ణయించాం. చేనేతల రుణభారం రూ.30 కోట్లు తీర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కుల, చేతి వృత్తులకు సముచిత న్యాయం చేస్తాం” అని రేవంత్‌రెడ్డి తెలిపారు. నైపుణ్యం గల చేనేత కళాకారులు, నూతన ఆవిష్కర్తల కోసం ఐఐహెచ్‌టీ ప్రారంభించారు. చేనేత రంగంలో ఆవిష్కర్తల ప్రోత్సాహానికి ప్రత్యేక కోర్సులు, శిక్షణ కార్యక్రమాలను ఇక్కడ అందించనున్నారు. అధునాతన పరిశోధన అవకాశాలను ఈ సంస్థ కల్పించనుంది. ఏటా 60 మందికి టెక్స్‌టైల్ టెక్నాలజీలో డిప్లొమా కోర్సులు ఇవ్వనున్నారు.