తిహార్ జైలులో ఉన్న ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యంపై ‘ఇండియా’ కూటమి ఆందోళన వ్యక్తం చేసింది. ఆయన ఆరోగ్యం విషయంలో అధికార వర్గాల వైఖరిపై త్వరలో ఢిల్లీలో నిరసనలను కూటమి నేతలు సిద్ధమవుతున్నారు. ఈ విషయాన్ని ఆప్ గురువారం వెల్లడించింది.
జులై 30న విపక్ష కూటమి పార్టీల ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరసన తెలుపుతామని ఆప్ ప్రకటించింది. కేంద్రంలోని బిజెపి కేజ్రీవాల్ హత్యకు కుట్ర పన్నుతోందని మరోసారి ఆరోపించింది. కాగా.. మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన కేజ్రీవాల్ ప్రస్తుతం తిహాడ్ జైల్లో ఉన్నారు. కారాగారానికి వెళ్లిన తర్వాత ఆయన 8.5 కిలోల బరువు తగ్గారని.. ఆయన చక్కెర స్థాయిలు ఐదుసార్లు 50 కంటే తక్కువకు పడిపోయాయని ఆప్ నేతలు పేర్కొన్నారు. ఇవి కేవలం ఆరోపణలు మాత్రమేనని జైలు అధికారులు ఖండించిన సంగతి తెలిసిందే. కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగానే ఆహారాన్ని తక్కువగా తీసుకుంటున్నారని.. అదే ఆయన బరువు తగ్గడానికి కారణమని ఢిల్లీ గవర్నర్ వీకే సక్సేనా ఆరోపించారు. దీనిపై స్పందించిన ఆప్ ఆయన వ్యాఖ్యలను ఖండించింది.