భారతదేశంలోని కేంద్ర పాలిత ప్రాంతమైన లద్దాఖ్‌కు సంబంధించి కేంద్రం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడ కొత్తగా ఐదు జిల్లాలను ఏర్పాటుచేయనుంది. ఈమేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించారు.
”అభివృద్ధి చెందిన, సుసంపన్నమైన లద్దాఖ్‌ను నిర్మించాలనే ప్రధాని మోడీ సంకల్పంలో భాగంగా ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో ఐదు కొత్త జిల్లాలను ఏర్పాటుచేయాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నిర్ణయించింది. కొత్తగా ఏర్పాటు చేయబోయే జన్‌స్కర్, ద్రాస్, షామ్, నుబ్రా, చాంగ్‌థాంగ్ జిల్లాలతో ప్రభుత్వ పాలన మరింత పటిష్టమవుతుంది. ప్రతీ ఇంటికి ప్రభుత్వ ఫలాలు అందుతాయి. లద్దాఖ్ ప్రజలకు అవకాశాలను సమృద్ధిగా అందించేందుకు మా ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది” అని అమిత్ షా రాసుకొచ్చారు. తాజా నిర్ణయంపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్పందించారు. ”లద్దాఖ్ ప్రజల శ్రేయస్సు, మెరుగైన పాలనకు ఇదో ముందడుగు. కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు అవకాశాలు, సేవలు మరింత చేరువవుతాయి” అని మోదీ హర్షం వ్యక్తం చేశారు.