Tuesday, October 15, 2024
HomeUncategorizedఎవ‌రికి అర్థం కాని మందులు రాసిన వైద్యుడు

ఎవ‌రికి అర్థం కాని మందులు రాసిన వైద్యుడు

Date:

పెషేంట్ల‌కు వైద్యులు రాసే మందులు అర్థ‌మ‌య్యే విధంగా ఉండాల‌ని ప్ర‌భుత్వ నిబంధ‌న‌లు మారడంతో కొంత‌మంది వైద్యులు అర్థ‌మ‌య్యే విధంగానే చీటీ రాస్తున్నారు. కాని తాజాగా ఓ డాక్టర్‌ రాసిన ప్రిస్క్రిప్షన్‌ చూసి రోగితో పాటు ఫార్మాసిస్టులు కూడా ఆశ్చర్యపోయారు..! మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లా నాగోడ్‌ కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌కు ఇటీవల ఓ వ్యక్తి చికిత్స కోసం వెళ్లారు. అక్కడ అమిత్ సోని అనే వైద్యుడు రోగిని పరీక్షించి కొన్ని మందులు రాశారు. చదవడం రాని ఆ వ్యక్తి దాన్ని పట్టుకుని ఆసుపత్రిలో ఉన్న ఫార్మసీ వద్దకు వెళ్లాడు. ఆ ప్రిస్క్రిప్షన్‌ చూసిన ఫార్మసిస్ట్‌ అవాక్కయ్యాడు. అందులో ఏముందో అర్థం కాక అక్కడి వారు తలపట్టుకున్నారు. తమ వద్ద ఆ మందులు లేవంటూ రోగిని పంపించారు.

ఆ చీటీ పట్టుకుని సదరు వ్యక్తి ఓ ప్రైవేటు మెడికల్‌ స్టోర్‌కు వెళ్లాడు. అక్కడున్న సిబ్బంది దాన్ని చూడగానే షాక్‌ అయ్యారు. ఎందుకంటే.. ఆ చీటీపై మందుల పేర్లు పిచ్చిగీతలు గీసినట్లుగా ఉన్నాయి. దీంతో ఆ ఫార్మసీ యజమాని దాన్ని ఫొటో తీసి నెట్టింట షేర్‌ చేశారు. దీంతో అది కాస్తా వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. ‘ఈ మందులు ఎక్కడ దొరుకుతాయో మరి’ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదికాస్తా ఆరోగ్యశాఖ దృష్టికి చేరడంతో అధికారులు దీనిపై చర్యలు చేపట్టారు. దీనిపై వివరణ ఇవ్వాలంటూ డాక్టర్ అమిత్ సోనీకి నోటీసులు జారీ చేశారు. అతని స్పందన వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. ఇదిలా ఉండగా.. ఆ డాక్టర్‌ తన ఇంటి వద్ద ప్రైవేటు క్లినిక్‌ నిర్వహిస్తున్నారని, ప్రైవేటు ఫార్మసీలతో ఒప్పందాలు చేసుకుని రోగులు అక్కడే మందులు కొనేలా బలవంతం చేస్తున్నారని ఆరోపణలు బయటికొచ్చాయి. వాటిపైనా అధికారులు దర్యాప్తు చేపట్టారు.