Thursday, October 10, 2024
HomeUncategorizedఆకస్మిక‌ వ‌రద‌ల‌కు ఊరంతా కొట్టుకుపోయింది..

ఆకస్మిక‌ వ‌రద‌ల‌కు ఊరంతా కొట్టుకుపోయింది..

Date:

హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని ప‌లు జిల్లాల్లో క్లౌడ్‌ బరస్ట్‌ కారణంగా బుధవారం రాత్రి కుండపోత వర్షం కురిసింది. దాంతో ఇండ్లు, పాఠశాలలతో పాటు ఆసుపత్రులు సైతం దెబ్బతిన్నాయి. ఈ వరద విలయానికి భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. దాదాపు 50 మందికిపైగా గల్లంతయ్యారు. పది మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ వరదలకు సమేజ్‌ గ్రామం పూర్తిగా కొట్టుకుపోయింది. ఒక్క ఇల్లు మాత్రమే మిగిలింది. గ్రామం కొట్టుకుపోయిన తీరును అనితా దేవి అనే మహిళ కళ్లకు కట్టినట్లు వివరించారు. ‘బుధవారం రాత్రి మేం నిద్రిస్తున్నాం. ఆ సమయంలో భారీగా శబ్దం వినిపించింది. మా ఇల్లు ఒక్కసారిగా కుదుపులకు లోనైంది. దీంతో మేం నిద్రలోంచి లేచి బయటకు వెళ్లి చూసేసరికి ఊరు మొత్తం కొట్టుకుపోయింది. భయంతో మేమంతా వెంటనే గ్రామంలోని భగవతి కాళీ మాత ఆలయం వద్దకు చేరుకున్నాం. రాత్రంతా అక్కడే ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపాం. ఈ విధ్వంసంలో మా ఇల్లు మాత్రమే మిగిలింది. మిగతావన్నీ కళ్ల ముందే కొట్టుకుపోయాయి’ అంటూ భావోద్వేగంతో వివరించింది.

మరో బాధితుడు బక్షి రామ్‌ మాట్లాడుతూ.. ‘నా కుటుంబ సభ్యులు దాదాపు 14 నుంచి 15 మంది వరదలో కొట్టుకుపోయారు. తెల్లవారుజామున 2 గంటలకు నాకు వరద వార్త అందింది. ఆ సమయంలో నేను ఊర్లో లేను. రాంపూర్‌లో ఉన్నాను కాబట్టి ప్రాణాలతో బయటపడ్డాను. తెల్లవారుజామున 4 గంటలకు ఇక్కడకు వచ్చాను. అప్పటి నుంచి గల్లంతైన నా కుటుంబ సభ్యుల కోసం వెతుకుతున్నాను. ఒక్కరైనా సజీవంగా ఉంటారని ఆశిస్తున్నాను’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. డిస్ట్రిక్ట్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ ప్రకారం.. కులు, మండి, సిమ్లా ప్రాంతాల్లో క్లౌడ్‌ బరస్ట్‌ కారణంగా వరదలు సంభవించాయి. ఈ వరదలకు సుమారు 53 మంది గల్లంతయ్యారు. ఇక ఇప్పటి వరకూ ఆరు మృతదేహాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వరదల కారణంగా 60కి పైగా ఇళ్లు కొట్టుకుపోయాయి. పలు గ్రామాలు తీవ్రంగా నష్టపోయాయని డీడీఎంఏ ప్రత్యేక కార్యదర్శి డీసీ రాణా తెలిపారు.