అండం ఇచ్చిన మహిళకు పుట్టిన బిడ్డపై చట్టపరమైన హక్కు ఉండదని బాంబే హైకోర్టు వెల్లడించింది. పిల్లలకు వారు జీవసంబంధ తల్లిదండ్రులుగా చెప్పడం కుదరదని స్పష్టం చేసింది. తన కవల కుమార్తెలను చూసేందుకు ఓ మహిళకు అనుమతిస్తూ ఈ తీర్పు చెప్పింది. తన కవల పిల్లలు సరోగసీ ద్వారా జన్మించారని, వారు తన భర్త, సోదరితో ఉంటున్నారంటూ ఓ మహిళ కోర్టులో పిటిషన్ వేశారు. తన సోదరే అండం దానం చేసిందని, కానీ తన భర్త మాత్రం అండం దానం చేసిన మరదలికే పిల్లలపై చట్టపరమైన హక్కు ఉంటుందని వాదిస్తున్నారని పేర్కొంది. ఆ వాదనను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. పిటిషనర్ సోదరిని జీవసంబంధ తల్లిగా చెప్పే హక్కు ఉండదని స్పష్టం చేసింది.
పిటిషనర్ సోదరి చేసిన అండ దానంతో సరోగసీ ద్వారా 2019లో కవలలు జన్మించారు. అదే సమయంలో పిటిషనర్ సోదరి కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురైంది. దాంతో ఆమె కుమార్తె, భర్త మృతి చెందారు. 2019 నుంచి 2021 మార్చి వరకు ఇద్దరు పిల్లలతో కలిసి పిటిషనర్, ఆమె భర్త కలిసే ఉన్నారు. ఆ తరువాత వైవాహిక బంధంలో విభేదాల కారణంగా 2021లో భార్యకు చెప్పకుండా ఇద్దరు పిల్లలతో కలిసి భర్త వేరే ఇంటికి వెళ్లిపోయాడు. అక్కడ రోడ్డు ప్రమాదంతో కుంగుబాటుకు గురైన తన మరదలు.. పిల్లల బాగోగులను చూసుకునేందుకు తనతోనే ఉంటుందని పిటిషనర్ భర్త చెప్పడంతో పిటీషనర్ పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాకుండా, స్థానిక కోర్టును ఆశ్రయించారు. కింది కోర్టు తన అభ్యర్థనను తిరస్కరించడంతో ఆమె హైకోర్టును ఆశ్రయించగా తాజా తీర్పు వెలువడింది.