తెలంగాణ రాష్ట్రంలోని బీసీ రిజర్వేషన్ల అమలుకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో విడుదల చేసింది. బీసీ రిజర్వేషన్లపై అధ్యయనం చేసే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం బీసీ కమిషన్‌కు అప్పగించింది. దీనిని సవాల్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య హైకోర్టును ఆశ్రయించారు. రిజర్వేషన్ల అమలుపై అధ్యయనం చేసే బాధ్యతను బీసీ కమిషన్‌కు అప్పగించడం సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు.
”ప్రభుత్వ జీవో ప్రకారం ఒకటి రెండు నెలల పాటు రాష్ట్రంలో బీసీ కమిషన్ అధ్యయనం చేసి నివేదిక అందిస్తుంది. గతంలో మహారాష్ట్రలో ఇలాగే బీసీ కమిషన్ చేసిన అధ్యయనాన్ని అక్కడి హైకోర్టు కొట్టివేసింది. ఇక్కడ నివేదిక సమర్పించిన తర్వాత అదేవిధంగా జరిగితే సమయం వృథా అవుతుంది. అందువల్ల ఇప్పడే ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలి” అని పిటిషనర్ తరఫున మాజీ అడ్వొకేట్ జనరల్ ప్రసాద్ కోర్టును కోరారు. పిటిషనర్ వాదనతో ఏకీభవించిన ధర్మాసనం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలుకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది.