తెలంగాణలో జరగబోయే గ్రూప్ -1 మెయిన్స్ కోసం పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలంగాణ డీజీపీ జితేందర్ వెల్లడించారు. పరీక్షకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరైనా ఇబ్బందులకు గురి చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కోర్టు ఆదేశాల ప్రకారమే పరీక్షలకు జరుగుతాయని, నిరసన పేరుతో రోడ్లపైకి వచ్చి ప్రజలను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
హైకోర్టు ఆదేశాలపై అభ్యంతరాలుంటే సుప్రీం కోర్టును ఆశ్రయించవచ్చని చెప్పారు. సికింద్రాబాద్ ముత్యాలమ్మ దేవాలయం ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, నిందితులను కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సంయమనం పాటించాలని కోరారు. సికింద్రాబాద్ ఘటనపైనా ఆందోళనలు చేయడం సరికాదన్నారు. తెలంగాణలో అక్టోబరు 21 నుంచి 31 వరకు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాలు నిర్వహించనున్నట్లు డీజీపీ వెల్లడించారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసు సిబ్బందికి నివాళులర్పిస్తామన్నారు. దేశవ్యాప్తంగా ఈ ఏడాది 214 మంది పోలీసులు ప్రాణత్యాగం చేశారని, తెలంగాణకు చెందిన ఓ పోలీసు అధికారి కూడా అమరులయ్యారని తెలిపారు.