Thursday, October 10, 2024
Homeతెలంగాణఅక్రమ నిర్మాణాలు అనిపిస్తే సీజ్‌ చేయవచ్చు కదా?

అక్రమ నిర్మాణాలు అనిపిస్తే సీజ్‌ చేయవచ్చు కదా?

Date:

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో కూల్చివేతలపై పలువురు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేప‌థ్యంలో హైడ్రా ప‌నితీరుపై తెలంగాణ హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. దీనిపై సోమవారం విచారణ జరిగింది. విచారణకు హైడ్రా కమిషనర్‌ రంగానథ్‌ వర్చువల్‌గా, అమీన్‌పూర్‌ తహసీల్దార్ కోర్టులో హాజరై వివరణ ఇచ్చారు. శని, ఆదివారాలు, సూర్యాస్తమయం తర్వాత ఎందుకు కూల్చివేతలు చేపడుతున్నారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదివారం మీరు ఎందుకు పని చేయాలని ప్రశ్నించింది. సెలవుల్లో ఎందుకు నోటీసులు ఇచ్చి, అత్యవసరంగా కూల్చివేస్తున్నారని అడిగింది. శని, ఆదివారాల్లో కూల్చివేయొద్దని గతంలో కోర్టు తీర్పులున్నాయని గుర్తు చేసింది. కోర్టు తీర్పుల విషయం కూడా తెలియదా అని తహసీల్దార్‌ను ప్రశ్నించింది. గతంలో మీరు కూల్చివేసిన కేసుపై స్టే విధించిన విషయం తెలియదా? అని అడిగింది. చట్టప్రకారం నడుచుకోకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుందని తహసీల్దార్‌ను హెచ్చరించింది.

హైడ్రా క‌మిష‌న‌ర్ తీరుపై అసంతృప్తిక‌రం

మూసీపై కూడా 20 లంచ్‌ మోషన్‌ పిటిషన్లు దాఖలయ్యాయి. ఇది అరుదైన కేసుగా భావించే అధికారులను విచారణకు పిలిచాం. జీవో ప్రకారం హైడ్రాకు ఎన్నో విధులు ఉన్నాయి. మిగతావి పట్టించుకోకుండా కూల్చివేతలపైనే దృష్టి పెట్టారు. ట్రాఫిక్‌ సమస్యపైనా హైడ్రాకు బాధ్యత ఉంది. కానీ దాని గురించి ఏమాత్రం పట్టించుకోవట్లేదు. మాదాపూర్‌లో ప్రయాణం ఎంత సమయం పడుతుందో తెలుసు కదా? నిబంధనలు పాటించకుంటే హైడ్రా ఏర్పాటు జీవోపై స్టే ఇవ్వాల్సి వస్తుంది. సబ్‌ రిజిస్ట్రార్‌ రిజిస్ట్రేషన్‌ చేస్తేనే సామాన్యులు ఇళ్లు నిర్మిస్తున్నారు. స్థానిక సంస్థ అనుమతి ఇస్తేనే ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపంతో సామాన్యులు నష్టపోవాల్సి వస్తోంది. ఆదివారం కూల్చివేతలు వద్దని త్రిసభ్య ధర్మాసనం తీర్పు ఉంది. అక్రమ నిర్మాణాలు అనిపిస్తే సీజ్‌ చేయవచ్చు కదా? హైడ్రా ఏర్పాటు అభినందనీయం.. పనితీరే అభ్యంతరకరం. అమీన్‌పూర్‌ తహసీల్దార్‌, హైడ్రా కమిషనర్‌ తీరు అసంతృప్తికరం. ఒక్కరోజులో హైదరాబాద్‌ను మార్చాలనుకోవడం సరికాదు. ఎఫ్టీఎల్‌ నిర్ధరించకుండా అక్రమాలు అని ఎలా తేలుస్తారు?” అని హైకోర్టు ప్రశ్నించింది. విచారణను అక్టోబర్‌ 15కు వాయిదా వేసింది. అప్పటివరకు యథాతథ స్థితి కొనసాగించాలని హైడ్రా, అమీన్‌ఫూర్‌ తహసీల్దార్‌ను ఆదేశించింది. కౌంటర్లు దాఖలు చేయాలని చెప్పింది.