Saturday, December 7, 2024
Homeప్రత్యేక కథనాలుబ్రెయిన్ స్ట్రోక్ ఎందుకు వస్తుంది.. హఠాత్తుగా వస్తే ఏం చేయాలి..

బ్రెయిన్ స్ట్రోక్ ఎందుకు వస్తుంది.. హఠాత్తుగా వస్తే ఏం చేయాలి..

Date:

మ‌నిషికి ఎప్పుడు, ఏ వ్యాధి వ‌స్తుందో అర్థం కాని ప‌రిస్థితి నెల‌కొంది. అలాంటిది బ్రెయిన్ స్ట్రోక్ అనేది మెదడులో రక్త సరఫరా నిలిచిపోయినప్పుడు లేదా తగ్గినప్పుడు సంభవించే పరిస్థితి. ఇది ఒక అత్యవసర వైద్య పరిస్థితి, దీనిని తక్షణమే గుర్తించి చికిత్స చేయకపోతే, మానసిక , శారీరక సమస్యలు, అలాగే మరణానికి కూడా దారితీస్తుంది. రక్తనాళాల్లో అవరోధం లేదా అవి చీలిపోవడమే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేందుకు ప్రధాన కారణాలు . దీనికి హైపర్‌టెన్షన్, కొలెస్ట్రాల్ స్థాయి, డయాబెటిస్, ఇతర జీవనశైలి సంబంధిత కారణాలు ప్రభావితం చేస్తాయి.

*బ్రెయిన్ స్ట్రోక్ రకాలు:*

బ్రెయిన్ స్ట్రోక్‌లో రెండు ప్రధాన రకాల ఉన్నాయి. వాటిల్లో ఇస్కీమిక్ స్ట్రోక్ ఒకటి. ఇది సగం పైగా స్ట్రోక్‌లకు కారణం అవుతుంది. రక్తంలో గడ్డలు ఏర్పడి రక్తం సరఫరా నిలిచిపోయినప్పుడు ఇది జరుగుతుంది. ఇది మెదడులో ఆక్సిజన్ తక్కువగా ఉండడానికి కారణమవుతుంది. హేమరేజిక్ స్ట్రోక్ ప్రధానంగా మెదడులో రక్తనాళాలు చిట్లిపోవడం వల్ల సంభవిస్తుంది, దీని వల్ల మెదడులో రక్తస్రావం అవుతుంది.

*బ్రెయిన్ స్ట్రోక్‌కు కారణాలు:*

బ్రెయిన్ స్ట్రోక్‌కు దారితీసే కారణాలలో అధిక రక్తపోటు బ్రెయిన్ స్ట్రోక్‌కు ప్రధాన కారణం. రక్తపోటు అధికంగా ఉన్నప్పుడు, రక్తనాళాలపై ఒత్తిడి పెరుగుతుంది, దీనివల్ల అవి చిట్లిపోవడం లేదా గడ్డలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అధిక కొలెస్ట్రాల్ రక్తనాళాల్లో పేరుకుపోయి అవి కుంచింపుకు గురవుతాయి. ఇది రక్త ప్రసరణలో అంతరాయం కలిగిస్తుంది, దీని వల్ల మెదడులో రక్తం నిలిచిపోయి స్ట్రోక్ సంభవిస్తుంది. షుగర్ స్థాయి ఎక్కువగా ఉండడం వల్ల రక్తనాళాలపై ప్రభావం చూపుతుంది, ఇది స్ట్రోక్ వచ్చే అవకాశం పెంచుతుంది. ధూమపానం, మద్యం, వ్యాయామం లేని జీవనశైలి వంటి అలవాట్లు బ్రెయిన్ స్ట్రోక్ కు కారణమవుతాయి. ధూమపానం వల్ల రక్తనాళాలు సంకుచిస్తాయి, మద్యం వల్ల రక్తపోటు పెరుగుతుంది. కుటుంబంలో స్ట్రోక్ చరిత్ర ఉన్నవారిలో స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది.

*బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు:*

బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు గుర్తించాల్సిన కొన్ని ముఖ్య లక్షణాలు ఉన్నాయి. ముఖం, చేతులు, కాళ్లలో ఒక్కసారిగా నొప్పి లేక తిమ్మిరి రావడం. మాట్లాడే సామర్థ్యం తగ్గడం, మాటల్లో తడబడటం. తలనొప్పి, విపరీతంగా కళ్ల ఎదుట గందరగోళం రావడం. సమతుల్యత కోల్పోవడం లేదా నడకలో తడబాటు వంటి లక్షణాలు కన్పిస్తాయి.

*తీసుకోవాల్సిన జాగ్రత్తలు:*

బ్రెయిన్ స్ట్రోక్ ను నివారించడానికి సాధ్యమైనంత వరకు రక్తపోటు, షుగర్ , కొలెస్ట్రాల్ స్థాయిలను క్రమం తప్పకుండా పరీక్షించుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, మానసిక ఒత్తిడిని తగ్గించడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలను తగ్గించుకోవచ్చు.