మహిళలను ఎందుకు సన్యాసినులుగా మారేలా ప్రేరేపిస్తున్నారని మద్రాస్ హైకోర్టు ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్జీ వాసుదేవ్‌ను ప్రశ్నించింది. ఓ కేసులో కోర్టు ఆ ప్రశ్న వేసింది. తన స్వంత కూతురి పెళ్లి చేసిన సద్గురు, ఎందుకు ఇతర అమ్మాయిలను సన్యాసం వైపు మళ్లిస్తున్నారని కోర్టు ప్రశ్నించింది. జస్టిస్ ఎస్ఎం సుబ్రమణియం, వీ శివజ్ఞానంతో కూడిన ధర్మాసనం ఈ ప్రశ్నలు వేసింది. తన ఇద్దరు కూతుళ్లను సద్గురు బ్రెయిన్‌వాష్ చేశారని, వాళ్లు పర్మనెంట్‌గా ఈషా యోగా సెంటర్‌లోనే ఉంటున్నారని ఓ రిటైర్డ్ ప్రొఫెసర్ ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జగ్గీపై కేసు ఫైల్ చేశారు.
కోయంబత్తూరులోని తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎస్ కామరాజ్ ఆ కేసు ఫైల్ చేశారు. 42, 39 ఏళ్లు ఉన్న ఇద్దరు మహిళలు ఆ కేసులో ఇవాళ కోర్టు ముందు హాజరయ్యారు. అయితే తమ ఇష్ట ప్రకారమే ఈషా ఫౌండేషన్‌లో ఉంటున్నట్లు చెప్పారు. తమను ఎవరూ బంధించలేదని చెప్పారు. కూతుళ్లు వదిలి వెళ్లడం వల్ల తమ జీవితం దుర్భరమైనట్లు ఆ పేరెంట్స్ కోర్టుకు వెల్లడించారు. అయితే ఈ కేసులో మరింత లోతుగా విచారణ చేపట్టాలని జడ్జీ సూచించారు. ఈషా ఫౌండేషన్‌తో లింకున్న అన్ని కేసులను లిస్టు చేయాలని పోలీసులకు ఆదేశాలిచ్చారు. తన కూతురుకు పెళ్లి చేసి, జీవితంలో సెటిలయ్యేలా చేశారని, కానీ ఇతరుల కూతుళ్లను మాత్రం సన్యాసుల్లా జీవించేలా ప్రేరేపిస్తున్న సద్గురు ఎందుకు అలా చేస్తున్నారో తెలుసుకోవాలని ఉందని జస్టిస్ శివజ్ఞానం తెలిపారు. స్వచ్ఛందంగా ఉండేందుకు మహిళలు నిర్ణయించినట్లు ఈషా ఫౌండేషన్ తెలిపింది.