దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు విచారణలో ఉన్న నేరగాళ్ల ఇళ్లు, ప్రైవేటు ఆస్తులపైకి బుల్డోజర్లను నడిపించే విషయంలో బాధితులకు ఉపశమనం ఇవ్వడం, దేశస్థాయిలో మార్గదర్శకాల తయారీపై నేడు న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఇప్పటికిప్పుడు ‘బుల్డోజర్ న్యాయం’ చేయడంపై సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది.
జస్టిస్ బి.ఆర్.గవాయ్ నేతృత్వంలోని బెంచ్ వాదనలు వినింది. అనధికారికంగా జరిపే ఇటువంటి బుల్డోజర్ చర్యలను అక్టోబర్ 1వ తేదీ వరకు నిలిపివేయాలని పేర్కొంది. మరోవైపు వీటిని ఆపితే ఆక్రమణల తొలగింపు ఆలస్యమవుతుందన్న ప్రభుత్వ భయాలను కొట్టిపారేసింది. ”వచ్చే విచారణ తేదీ వరకు మీ చర్యలను ఆపమని మేం కోరినంత మాత్రాన కొంపలేం మునిగిపోవు” అని జస్టిస్ బి.ఆర్.గవాయ్, కె.వి.విశ్వనాథన్ వ్యాఖ్యానించారు.
ఈ నెలలో ఇప్పటికే రెండు సార్లు వివిధ రాష్ట్రాలు చేపట్టిన ‘బుల్డోజర్ చర్యల’పై న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ప్రాక్టీస్‌ను హీరోయిజంగా చూపే యత్నం చేయవద్దని హెచ్చరించింది. తమ అనుమతులు లేకుండా ఎటువంటి కూల్చివేతలు చేపట్టొద్దని తేల్చిచెప్పింది. దీనిపై ఎన్నికల కమిషన్‌కు కూడా నోటీసులు జారీ చేస్తామని వెల్లడించింది.