సుప్రీంకోర్టులో హత్యకేసులో దోషిగా తేలిన 104 సంవత్సరాల వృద్ధుడికి ఊరట లభించింది. చివరి దశలో ఆయన కుటుంబంతో గడిపేందుకు ఆయనకు సర్వోన్నత న్యాయస్థానం మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. వివరాల్లోకి వెళితే.. బెంగాల్‌లోని మాల్దా జిల్లాలో జన్మించిన రసిక్ చంద్ర మండల్ 1988లో చేసిన హత్య కేసులో దోషిగా తేలడంతో జీవిత ఖైదు శిక్ష పడింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వుల్లో ‘రిట్ పిటిషన్ పెండింగ్‌లో ఉన్న సమయంలో ట్రయల్ కోర్టు షరతులపై పిటిషనర్ మండల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని ఆదేశిస్తున్నట్లు’గా పేర్కొంది. రసిక్ చంద్ర మండల్ 1920లో మాల్దా జిల్లాలో గ్రామంలో జన్మించారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా భారత జాతీయ కాంగ్రెస్ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించిన సంవత్సరం ఇదే కావడం విశేషం.