Sunday, September 29, 2024
Homeజాతీయంప్రసంగిస్తుండగా అస్వస్థతకు గురైన ఖర్గే

ప్రసంగిస్తుండగా అస్వస్థతకు గురైన ఖర్గే

Date:

జమ్మూకశ్మీర్‌లోని కఠువా జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అనూహ్య సంఘటన జరిగింది. కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వేదికపై అస్వస్థతకు గురయ్యారు. ప్రసంగిస్తున్న సమయంలో అదుపు తప్పి పడిపోబోయారు. దీంతో అక్కడున్న నేతలు ఆయన్ను పట్టుకున్నారు. వెంటనే ఖర్గేకు నీరు తాగించారు. అయినప్పటికీ ఆయన ప్రసంగాన్ని మాత్రం ఆపలేదు. పార్టీ నేతలు ఆయనను పట్టుకుని నిలబడి ఉండగా.. ప్రసంగాన్ని కొనసాగించారు. ”జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను తిరిగి తీసుకువస్తాం. అందుకోసం పోరాడుతూనే ఉంటాం. ఎనిమిది పదుల వయసులో ఉన్న నేను.. అప్పుడే చనిపోను. మోడీ సర్కార్‌ను గద్దె దించే వరకు అలసిపోను. అప్పటివరకు బతికే ఉంటా” అని వ్యాఖ్యానించారు.

ఆయన అస్వస్థతకు గురైన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. వెంటనే పార్టీ అగ్రనాయకత్వం జమ్మూకశ్మీర్‌ నేతలను అప్రమత్తంగా ఉండమని సూచించింది. అనంతరం వైద్య బృందానికి సమాచారం అందించారు. కాగా.. జమ్మూకశ్మీర్‌లోని ఏడు జిల్లాల పరిధిలో తొలిదశ కింద 24 శాసనసభ నియోజకవర్గాలకు జరిగిన పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 61 శాతం పోలింగు నమోదు అయింది. రెండోవిడత పోలింగ్‌ ఆరు జిల్లాల్లోని 26 నియోజకవర్గాల్లో పూర్తికాగా.. మూడో విడత పోలింగ్‌కు జమ్మూకశ్మీర్‌ సిద్ధమైంది.