హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అనుమానం వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ నేతలు పవన్ ఖేరా, జైరాం రమేశ్ ప్రెస్ మీట్ ఏర్పాటుచేసి ఎన్నికల ఫలితాలపై మాట్లాడారు. హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను తాము అంగీకరించడం లేదని వారు తేల్చిచెప్పారు. ఈవీఎంలలో అవకతవకలు జరిగాయని, ప్రజల అభీష్టాన్ని బీజేపీ తారుమారు చేసిందని ఆరోపించారు. మధ్యాహ్నం వరకు తాను ఈసీతో టచ్‌లో ఉంటూ మూడు జిల్లాల్లోని ఈవీఎంలపై ఫిర్యాదు చేసినట్లు జైరామ్ రమేశ్ తెలిపారు.
హర్యానాలో ఫలితాలు పూర్తిగా అనూహ్యంగా, ఆశ్చర్యకరంగా ఉన్నాయని రమేష్ వ్యాఖ్యానించారు. క్షేత్రస్థాయి పరిస్థితికి ఇవి పూర్తి విరుద్ధంగా ఉన్నాయన్నారు. ఇది ప్రజాభీష్టాన్ని తారుమారు చేయడమేనని, ప్రజాస్వామ్య ప్రక్రియను నాశనం చేయడమేనని విమర్శించారు. ఉదయమే ఈసీ వెబ్ సైట్లో ఫలితాల సరళి అప్ డేట్ సరిగా జరగడం లేదంటూ జైరామ్ రమేశ్ ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఈసీ.. కాంగ్రెస్ ఆరోపణలు బాధ్యతారాహిత్యం అని పేర్కొంది. మరో కాంగ్రెస్ నేత పవన్ ఖేరా కూడా హర్యానా ఫలితాలు అనూహ్యంగా ఉన్నాయని అన్నారు.