ఉత్తరప్రదేశ్‌లోని సంభల్‌లో ఉన్న షాహీ ఈద్గా మసీద్‌లో సర్వే చేపట్టేందుకు స్థానిక కోర్టు ఇచ్చిన ఆదేశాలను నిలిపివేయాలని కోరుతూ ఆ మసీదు కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ట్రయల్ కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ.. అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాలని మసీదు కమిటీకి శుక్రవారం సుప్రీంకోర్టు సూచించింది. షాహీ ఈద్గా మసీదు వద్ద గతంలో హరిహర హిందూ దేవుళ్ల ఆలయం ఉన్నట్లు వేసిన పిటీషన్ ఆధారంగా సర్వే చేపట్టేందుకు ట్రయల్ కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం సుప్రీంకోర్టు ఆ కేసులో స్పందిస్తూ.. శాంతి, సామరస్యాన్ని పాటించాలని అత్యున్నత న్యాయస్థానం తన ఆదేశాల్లో కోరింది.
ఈ కేసులో హైకోర్టు వాదనలు వినేంత వరకు.. ట్రయల్ కోర్టు ఆదేశాలను అమలు చేయరాదు అని సుప్రీం ధర్మాసనం తెలిపింది. ఈ కేసును పెండింగ్‌లో పెడుతున్నామని, అక్కడ ఏమీ జరగాల్సిన అవసరం లేదని, మనం తటస్థంగా ఉండాలని, అక్కడ ఏమీ జరగకుండా చూడాలని చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా తెలిపారు. ఈ కేసును హైకోర్టు సమీక్షించేంత వరకు.. జనవరి 8వ తేదీన జరగాల్సిన ట్రయల్‌కోర్టు విచారణ కూడా జరగదని సుప్రీం చెప్పింది. మసీదులో సర్వే చేయాలని స్థానిక కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో వారం క్రితం సంభల్‌లో హింసాత్మక ఆందోళనలు చెలరేగాయి. స్థానికులు, పోలీసుల మధ్య హింస చోటుచేసుకున్నది.