విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడికి తల్లిదండ్రులు దేహశుద్ధి చేశారు. స్థానిక (మోడల్ స్కూల్) ఆదర్శ పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న రవికుమార్ తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని విద్యార్థినులు తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. పల్నాడు జిల్లా కారంపూడిలో ఘటన జరిగింది.
దీంతో పాఠశాలకు వచ్చిన తల్లిదండ్రులు రవికుమార్‌పై దాడి చేశారు. గురువు స్థానంలో ఉండి అసభ్యంగా ప్రవర్తించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థినుల వసతి గృహంలోకి వెళ్లి అసభ్యంగా ప్రవర్తిస్తుంటే పాఠశాల సిబ్బంది, ప్రధానోపాధ్యాయుడు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వెంటనే రవికుమార్‌ను విధుల నుంచి తొలగించాలని ఆందోళనకు దిగారు. తల్లిదండ్రుల ఫిర్యాదుమేరకు ఎంఈవో, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. వివరాలు సేకరించి ఉన్నతాధికారులకు నివేదిక అందించారు.