దేశంలో ఇటీవల కొంతమంది దుండగులు రైళ్లు పట్టాలు తప్పేలా కొన్ని కుట్రపూరిత ప్రయత్నాలు వెలుగు చూడటం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. పట్టాలపై ఎల్‌పీజీ సిలిండర్లు, సైకిళ్లు, ఇనుప రాడ్లు, సిమెంట్ ఇటుకలు పెట్టి రైలుకు ప్రమాదం తలపెట్టే ఘటనలు కలకలం రేపాయి. ఇటువంటి వాటిపై రైల్వేశాఖ అప్రమత్తంగా ఉందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఈ తరహా ఘటనలను నిర్మూలించేందుకు అనేక రాష్ట్రాల యంత్రాంగం, పోలీసులతో చర్చలు జరుపుతున్నామన్నారు. రైలు ప్రమాదాలకు ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
జైపుర్‌లో పలు మార్గాల్లో కవచ్ పనితీరును పరిశీలించేందుకు వచ్చిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్.. ఇటీవల వెలుగు చూస్తున్న దుశ్చర్యలపై మాట్లాడారు. ”రాష్ట్ర ప్రభుత్వాలు, డీజీపీలు, హోంశాఖ కార్యదర్శులతో చర్చలు జరుపుతున్నాం. ఇందులో ఎన్‌ఐఏ కూడా భాగస్వామ్యమైంది. అటువంటి ప్రమాదాలకు ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇది మా దృఢనిశ్చయం” అని అన్నారు. ఇటువంటి ఘటనలపై రైల్వే శాఖ అప్రమత్తంగా ఉందని.. దీనిపై రైల్వే పోలీసులతోపాటు స్థానిక పోలీస్ స్టేషన్లతో అన్ని రైల్వే జోన్ల అధికారులు కలిసి పనిచేస్తున్నారని అన్నారు.