కన్నతల్లిదండ్రులు రూ.40 వేలకు నాలుగేండ్ల చిన్నారిని అమ్మేశారు. గుర్తించిన పోలీసులు ఆ బాలికను రక్షించారు. తల్లిదండ్రులతో పాటు మరో నలుగురిని ఒడిశా పోలీసులు అరెస్టు చేశారు. బీహార్‌కు చెందిన ఓ జంట.. ఒడిశాలోని భువనేశ్వర్ సమీపంలో ఉన్న బదగడ నివాసం ఉంటున్నారు. వారికి నాలుగేండ్ల కుమార్తె ఉన్నది. రోజువారీ కూలీలుగా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే బుధవారం ఆ చిన్నారిని సంతానం లేని ఓ జంటకు రూ.40 వేలకు అమ్మేశారు. అయితే వారి ఇంటి యజమాని ఈ విషయాన్ని పోలీసులకు చెప్పారు. దీంతో రంగంలోకి దిగిన ఖాకీలు.. పిప్లీ ప్రాంతంలో ఆ చిన్నారిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
ఆమె తల్లిదండ్రులతో పాటు.. చిన్నారిని కొనుగోలు చేసిన జంటను, వారికి మధ్యవర్తుగా ఉన్న మరో ఇద్దరిని అరెస్టు చేశారు. విచారణ సందర్భంగా ఆర్థిక ఇబ్బందులతో తమ కూతురిని అమ్మినట్లు వారు వెల్లడించారని బదగడ సీఐ సార్థక్ మహాదిక్ వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేశారని, దర్యాప్తు కొనసాగుతున్నదని తెలిపారు.