Saturday, December 7, 2024
Homeజాతీయంరాహుల్‌ రికార్డును బ్రేక్ చేసిన ప్రియాంకా గాంధీ

రాహుల్‌ రికార్డును బ్రేక్ చేసిన ప్రియాంకా గాంధీ

Date:

కేరళలోని వాయనాడ్‌ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, సోనియాగాంధీ తనయ ప్రియాంకాగాంధీ వాద్రా ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, సీపీఐ అభ్యర్థి సత్యన్‌ మొకేరిపై 4,08,0036 ఓట్ల మెజారిటీతో ఆమె భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. దాంతో వాయనాడ్ లోక్‌సభ స్థానంలో అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిచిన అభ్యర్థిగా ఆమె రికార్డు నెలకొల్పారు. గతంలో ఈ రికార్డు ప్రియాంకాగాంధీ సోదరుడు రాహుల్‌గాంధీ పేరిట ఉంది. రాహుల్‌గాంధీ సాధించిన 3.64 లక్షల ఓట్ల మెజారిటీయే ఆ నియోజకవర్గంలో ఇప్పటివరకు అత్యధిక మెజారిటీగా ఉంది. ఇప్పుడు 4.08 లక్షల ఓట్ల మెజారిటీతో ప్రియాంకాగాంధీ ఆ రికార్డును బద్ధలు కొట్టారు.

గత లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌గాంధీ తన సిట్టింగ్‌ స్థానమైన వాయనాడ్‌తోపాటు, ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నుంచి బరిలో దిగారు. రెండు స్థానాల్లో ఆయన విజయం సాధించారు. దాంతో ఆయన వాయనాడ్‌ లోక్‌సభ స్థానానికి రాజీనామా చేశారు. ఆ తర్వాత నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆ స్థానంలో తన సోదరి ప్రియాంకాగాంధీని బరిలో దించారు. వాయనాడ్‌ ఓటర్లు ఆమెను భారీ మెజారిటీతో గెలిపించారు.