Thursday, October 10, 2024
Homeజాతీయంరాజకీయాల్లోకి రావొద్ద‌ని కేజ్రీవాల్‌కు ముందే చెప్పా

రాజకీయాల్లోకి రావొద్ద‌ని కేజ్రీవాల్‌కు ముందే చెప్పా

Date:

ఢిల్లీ లిక్క‌ర్ కేసులో అరెస్టై బెయిల్‌పై విడుదలైన ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ తన పదవికి రాజీనామా చేస్తానన్న ప్రకటనపై సామాజిక కార్యకర్త అన్నా హజారే స్పందించారు. రాజకీయాల్లోకి రావద్దని కేజ్రీవాల్‌కు తాను గతంలోనే సూచించినట్లు తెలిపారు. అయితే ఆయన తన మాట వినలేదని విమర్శించారు. ‘రాజకీయాల్లోకి రావద్దని కేజ్రీవాల్‌కు ఇప్పటికే సలహా ఇచ్చా. సామాజిక సేవలోనే నిజమైన విలువ ఉంటుందని చాలాసార్లు వివరించా. కానీ ఆయన వినలేదు. అరవింద్ కేజ్రీవాల్ రాజకీయాల్లోకి రాకూడదని నేను మొదటి నుంచి చెబుతున్నా. ఆయన నా సలహాను పట్టించుకోకూడదని నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు జరిగింది అనివార్యం. అరవింద్‌ కేజ్రీవాల్‌ మనసులో ఏం ఆలోచన ఉందో నాకు తెలియదు’ అని మీడియాతో అన్నారు.

అన్నా హజారే గతంలో అరవింద్‌ కేజ్రీవాల్‌తో కలిసి ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆయన శిష్యుడిగా పేర్కొనే అరవింద్‌ కేజ్రీవాల్‌పై పలుసార్లు స్పందించారు. లిక్కర్‌ పాలసీ కేసులో కేజ్రీవాల్‌ అరెస్ట్‌పైనా అన్నా హజారే అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఒకప్పుడు నాతో పనిచేసి మద్యానికి వ్యతిరేకంగా మాట్లాడిన అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు మద్యం విధానాలను రూపొందించడంలో నిమగ్నం కావడంపై నేను తీవ్రంగా కలత చెందా. సొంత చర్యల పర్యవసానమే ఆయన అరెస్ట్‌’ అని వ్యాఖ్యానించారు.