Thursday, October 10, 2024
Homeజాతీయంమ‌ల్లిఖార్జున ఖ‌ర్గే సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండాలి

మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండాలి

Date:

కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని నరేంద్ర మోడీని గద్దె దించేవరకూ తాను చనిపోనని చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా స్పందించారు. అవి పూర్తిగా విద్వేషపూరిత వ్యాఖ్యలని పేర్కొన్నారు. ఖర్గే తన వ్యక్తిగత ఆరోగ్య విషయాల్లోకి అనవసరంగా ప్రధాని నరేంద్రమోడీని లాగారని అమిత్‌ షా అభ్యంతరం వ్యక్తంచేశారు. ఈమేరకు ఆయన తన ఎక్స్‌ ఖాతాలో పోస్టు పెట్టారు. ”నిన్న జమ్మూకశ్మీర్‌లో మల్లికార్జున ఖర్గే చేసిన ప్రసంగంలో అసహ్యకరమైన వ్యాఖ్యలు చేసి తన పార్టీ నేతలను మించిపోయారు. ప్రధాని మోదీపై కాంగ్రెస్‌ నాయకులకు ఎంతో ద్వేషం, భయం ఉందో ఈ వ్యాఖ్యలు తెలియజేస్తున్నాయి. వారు నిరంతరం మోడీ గురించే ఆలోచిస్తున్నారని ఇవి చెబుతున్నాయి” అని షా విమర్శించారు.

ఇక ఖర్గే ఆరోగ్యంపై అమిత్‌ షా స్పందించారు. ”ఖర్గే ఆరోగ్యం విషయంలో మోడీ జీ, నేను ప్రార్థిస్తున్నాం. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని మనమందరం ప్రార్థించాలి. ఆయన ఇంకా చాలా సంవత్సరాలు జీవించాలి. 2047 నాటి వికసిత్‌ భారత్‌ను చూడాలి” అని షా ఆకాంక్షించారు. జమ్మూకశ్మీర్‌లోని జస్‌రోటాలో ఆదివారం ఏర్పాటుచేసిన ఎన్నికల ర్యాలీలో ఖర్గే ప్రసంగించారు. జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించే వరకూ పోరాడుతూనే ఉంటామని ఆయన స్పష్టంచేశారు. ప్రస్తుతం తన వయసు 83 సంవత్సరాలైనప్పటికీ అప్పుడే చనిపోనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని గద్దె దించేవరకూ రాజకీయాల్లో క్రియాశీలంగానే ఉంటానని తెలిపారు. ఈసందర్భంగా ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వైద్య సాయం పొందిన తర్వాత భావోద్వేగపూరితంగా ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఖర్గే వ్యాఖ్యలపై భాజపా నేతలు మండిపడుతున్నారు. మరోవైపు అస్వస్థతకు గురైన ఖర్గేకు ప్రధాని మోడీ ఫోన్‌ చేసి క్షేమ సమాచారం అడిగి తెలుసుకున్నారు.