నిఫా వైరస్ కేరళ రాష్ట్రంలో కలకలం సృష్టిస్తోంది. ఈ వైరస్ కారణంగా ఓ మరణం కూడా సంభవించింది. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. వైరస్ కట్టడి చర్యలు చేపట్టారు. మలప్పురం జిల్లాలో ఈ నెల 9న మరణించిన 24 ఏళ్ల యువకుడికి నిఫా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. పెరింతల్‌మన్నలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందాడు. ఈ వ్యక్తి మరణానంతరం ప్రాంతీయ వైద్యాధికారి నిర్వహించిన దర్యాప్తులో నిఫా వైరస్ గురించి అనుమానం రావడంతో.. నమూనాలను పరీక్షల కోసం పంపించినట్లు ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. కొజికోడ్‌లో నిర్వహించిన పరీక్షల్లో నిఫా వైరస్ పాజిటివ్ అని నిర్ధారణ అయిందని వివరించారు. పుణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ కూడా ఇది నిఫా వైరస్ ఇన్ఫెక్షన్ అని ఆదివారం ధ్రువీకరించింది.
ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే నిఫా మరణం సంభవించిన మలప్పురం జిల్లాలో మాస్కులను తప్పనిసరి చేశారు. అదేవిధంగా తిరువలి పంచాయతీ పరిధిలోని నాలుగు వార్డుల్లో సినిమా థియేటర్లు, విద్యా సంస్థలను మూసివేయాల్సిందిగా ఆదేశించారు. ఎక్కువ మంది ప్రజలు ఒకే చోట గుమికూడొద్దని సూచించారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ ఈ నిబంధనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.