Saturday, December 7, 2024
Homeజాతీయంమ‌ణిపూర్‌కు త్వ‌ర‌లో 50 కంపెనీల బ‌ల‌గాలు

మ‌ణిపూర్‌కు త్వ‌ర‌లో 50 కంపెనీల బ‌ల‌గాలు

Date:

కొంత‌కాలంగా మ‌ణిపూర్ హింసాత్మ‌కంగా మారింది. తాజా పరిస్థితులపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. త్వరలో 50 కంపెనీల బలగాలను కేంద్రం మణిపుర్‌కు తరలించనున్నట్లు తెలుస్తోంది. అందుకు మంత్రిత్వ శాఖలో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. అంతేకాకుండా.. మంత్రిత్వశాఖ బృందం త్వరలో రాష్ట్రంలోని కీలక ప్రాంతాలను సందర్శించనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కాగా.. మణిపుర్‌లో జాతుల మధ్య వైరం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇటీవల నెలకొన్న పరిస్థితులు హింసాత్మకంగా మారాయి.

ఇటీవల సీఆర్‌పీఎఫ్‌ ఎన్‌కౌంటర్‌లో 10 మంది మృతి చెందడం, ఈ క్రమంలోనే మైతెయ్‌ తెగకు చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోవడంతో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. రాష్ట్ర సీఎం బీరేన్‌ సింగ్‌తో పాటు ముగ్గురు మంత్రులు, ఆరుగురు ఎమ్మెల్యేల నివాసాలపై ఆందోళనకారులు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఇళ్లల్లోకి చొరబడి ఫర్నిచర్, వాహనాలు, ఇతర సామగ్రిని తగలబెట్టారు. ఈ పరిస్థితులపై కేంద్రమంత్రి అమిత్‌ షా సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చి, శాంతి స్థాపనకు తీవ్రంగా యత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే మణిపుర్‌కు బలగాలను తరలించేందుకు కేంద్రం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.