భారత్, మాల్దీవుల మధ్య తలెత్తిన దౌత్య విభేదాల సంబంధాలను మెరుగుపర్చుకునేందుకు మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు అక్టోబర్ రెండో వారంలో అధికారికంగా భారత్‌లో పర్యటించనున్నట్లు అక్కడి అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇటీవల ఇరు దేశాల మధ్య తలెత్తిన దౌత్య విభేదాల తర్వాత.. ముయిజ్జు భారత్‌కు రావడం ఇది రెండోసారి. ప్రధానిగా నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఇతర దేశాధినేతలతో పాటుగా ముయిజ్జు హాజరయ్యారు. అక్టోబర్ 7-9 తేదీల్లో ఆయన భారత పర్యటనకు రానున్నారని, 8వ తేదీన ప్రధాని మోడీ, ఇతర అధికారులతో చర్చలు జరపనున్నారని సమాచారం. ఇరుదేశాల సత్సంబంధాల బలోపేతంతో పాటు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, ఇతర విషయాల గురించి ప్రధాని మోడీతో చర్చించనున్నారని సంబంధింత వర్గాలు పేర్కొన్నాయి.
చైనా అనుకూలుడిగా పేరున్న ముయుజ్జు.. అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తన మొదటి పర్యటన తుర్కియే, చైనాలో చేపట్టారు. భారత్ బలగాలు మాల్దీవులను విడిచివెళ్లిపోవాలని షరతు విధించడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అప్పట్లో మోడీ కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీప్‌లో పర్యటించిన సమయంలో.. కొందరు మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలతో ఇరుదేశాల మధ్య దూరం మరింత పెరిగింది. దాంతో సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. బాయ్‌కాట్ మాల్దీవ్స్ పేరిట హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అయింది. ఆ వ్యాఖ్యలతో తమ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని మాల్దీవుల ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రులపై వేటు వేసింది.