రద్దీగా ఉండే మార్కెట్లో ఓ యువకుడు బ్రా వేసుకుని సోషల్ మీడియా కోసం అసభ్యంగా రీల్స్ షూట్ చేయడం మొదలుపెట్టాడు. మార్కెట్‌లో దుకాణదారులు అడ్డుకోగా వారితో వాగ్వాదానికి దిగాడు. దాంతో వారు సదరు యువకుడికి దేహశుద్ధి చేసి, క్షమాపణ చెప్పించుకుని విడిచిపెట్టారు. హర్యానా రాష్ట్రంలోని పానిపట్ పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
పానిపట్‌లోని మార్కెట్ బిజిబిజీగా ఉంది. ఆ సమయంలో ఓ యువకుడు ప్యాంట్, బ్రా వేసుకుని ప్రత్యక్షమయ్యాడు. సోషల్ మీడియా కోసం ఆ అవతారంలో అసభ్యంగా రీల్స్ చిత్రించడం మొదలుపెట్టాడు. అతడి తీరుతో మహిళలు ఇబ్బంది పడుతుండటం గమనించిన దుకాణదారులు అడ్డగించారు. బిజీ మార్కెట్‌లో ఇంత మందిలో ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దని మందలించారు.
కానీ ఆ యువకుడు వారి మాటలు వినిపించుకోలేదు. తాను ఒక ఫ్యామస్ యూ ట్యూబర్‌ను అని, తాను గతంలో కూడా ఇలాంటి వీడియోలు చాలా చేశానని, తన అభిమానులకు ఇలాంటి వీడియోలే ఇష్టమని వాదించాడు. దాంతో ఆగ్రహించిన దుకాణదారులు అతడికి దేహశుద్ధి చేశారు. అతడితో క్షమాపణ చెప్పించుకున్నారు. మరోసారి అలాంటి పచ్చి పనులు చేయనని అతడితో చెప్పించుకుని వదిలిపెట్టారు.