మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలని రాజస్థాన్ గిరిజనులు మరోసారి ఆందోళన బాట పట్టారు. రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్‌లోని 49 జిల్లాలతో ‘భిల్ ప్రదేశ్’ను ఏర్పాటు చేయాలని కోరారు. రాజస్థాన్‌లో ఉన్న పాత 33 జిల్లాల్లో 12 జిల్లాలు కొత్త రాష్ట్రంలో చేర్చాలన్నారు. భిల్ సొసైటీకి చెందిన ఆదివాసి పరివార్ సహా 35 సంస్థల ఆధ్వర్యంలో గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పండిట్‌ల ఆదేశాలు ఎంతమాత్రం పాటించవద్దని ఆదివాసీ పరివార్ సంస్థ వ్యవస్థాపక సభ్యురాలు మనేక దామోర్ గిరిజన మహిళలకు పిలుపునిచ్చారు. ‘గిరిజన కుటుంబాలు సిందూరం పెట్టుకోవద్దు, మంగళ సూత్రం ధరించ వద్దు. గిరిజన మహిళలు, బాలికలు విద్యపై దృష్టి సారించండి. ప్రతి ఒక్కరూ ఇక నుంచి ఉపవాసాలు మానండి. మనం హిందువులం కాదు’ అని ఆమె అన్నారు. ప్రత్యేక రాష్ట్రం డిమాండ్‌ను తమ పార్టీ ఎప్పటి నుంచో దీనిని చేస్తున్నదని భారత్ ఆదివాసీ పార్టీ ఎంపీ రాజ్‌కుమార్ రోట్ తెలిపారు.