తెలంగాణలో తాము అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద రూ.10 లక్షల సదుపాయాన్ని అమల్లోకి తీసుకొచ్చాం. ఉచిత బస్సు ప్రయాణం వల్ల మహిళలకు రూ.3433 కోట్లు ఆదా అయింది. ఏడాది కాకముందే దేశంలోనే అతిపెద్ద రుణమాఫీ అమలు చేశాం. 22 లక్షల మంది రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేశాం. ఇందులో భాగంగా కేవలం 25 రోజుల్లోనే రూ.18 వేల కోట్లు జమ చేశాం. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించామని ప్రధాని మోడీ విమర్శలకు ‘ఎక్స్’ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి సమాధానమిచ్చారు.
బిజెపి పాలిత రాష్ట్రాల్లో గ్యాస్ ధరలు అధికంగా ఉన్నాయి. తెలంగాణలో రూ.500కే సిలిండర్ ఇస్తున్నాం. ఇప్పటివరకు 43 లక్షల మందికి సిలిండర్ పథకం ద్వారా లబ్ధి చేకూరింది. అధిక సంఖ్యలో ఉద్యోగ నియామకాలు చేపడుతున్నాం. గ్రూప్స్ పరీక్షలను రెగ్యులర్‌గా నిర్వహిస్తున్నాం. 11 నెలల్లోనే 50 వేలకు పైగా ఉద్యోగ నియామకాలు చేపట్టాం. నియామకాల్లో ఏ భాజపా పాలిత రాష్ట్రంతో పోల్చినా మాదే రికార్డు. హాస్టల్ విద్యార్థుల డైట్, కాస్మోటిక్ ఛార్జీలను 40 శాతానికి పైగా పెంచాం. మూసీ పునరుజ్జీవానికి నడుం బిగించాం. కబ్జాకు గురైన నీటి వనరులను సంరక్షిస్తున్నాం. ఫ్యూచర్ సిటీ కోసం మాస్టర్ ప్లాన్ ఖరారు చేస్తున్నాం. స్కిల్ వర్సిటీ, స్పోర్ట్స్ వర్సిటీ ఏర్పాటు చేస్తున్నాం. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నాం. ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానంపై పవిత్రమైన నిబద్ధతతో ఉన్నాం.” అని రేవంత్‌రెడ్డి తెలిపారు.