నీలకురింజి మొక్కలకు ఒక ప్రత్యేకత ఉంది.. ఎందుకంటే ఈ మొక్కలు సాధారణ పూల మొక్కల్లా ఎప్పటికి పూలు పూయవు. 12 ఏండ్లకు ఒక్కసారి మాత్రమే పూలు పూస్తాయి. ఈ మొక్కలు జీవితకాలంలో ఒక్కసారే పూతకు వస్తాయి. పూలు విరబూసిన తర్వాత మొక్కలు చనిపోతాయి. ఇక ఈ మొక్కలకు పూసే నీలకురింజి పూల అందాలను వీక్షించేందుకు రెండు కళ్లూ చాలవు.
తాజాగా తమిళనాడు రాష్ట్రం నీలగిరి జిల్లాలోని పిక్కపాటి మందు అనే గిరిజన గ్రామాన్ని ఆనుకుని ఉన్న కొండలపై నీలకురింజి పూలు విరబూశాయి. దీంతో ఆ ప్రాంతానికి ప్రత్యేకమైన కళ వచ్చింది. కనుచూపు మేర కొండ మొత్తం నీలకురింజి పూలు కనువిందు చేస్తున్నాయి. ఈ పూల అందాలను వీక్షించేందుకు చుట్టుపక్కల నుంచి స్థానికులు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వస్తున్నారు. ఈ మొక్కలు పన్నెండేండ్లు పెరిగి పూలు పూసిన తర్వాత చనిపోతాయట. అలా వాటి విత్తనాలతో మొలకెత్తే కొత్త మొక్కలు పూతకు రావడానికి మళ్లీ 12 ఏండ్లు పడుతుందట. ఈ పూలు నీలం రంగులో ఉండటం వల్ల వీటికి నీలకురింజి పుష్పాలు అనే పేరు వచ్చిందట.