అక్టోబర్ 2 జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాఠశాల విద్యార్థులతో కలిసి స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో ప్రజలు సైతం పాల్గొనాలని ఈసందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ‘నేను, నా యువ స్నేహితులతో కలిసి స్వచ్ఛత అభియాన్‌లో భాగమయ్యాను. మీరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను. ఈ చొరవ స్వచ్ఛభారత్ స్ఫూర్తిని మరింత బలోపేతం చేస్తుంది’ అని మోడీ తన ఎక్స్‌లో పేర్కొన్నారు.
ప్రధాని మోడీ పిలుపుమేరకు పలువురు రాజకీయ నాయకులు స్వచ్ఛ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, కిషన్‌రెడ్డి, రాజివ్‌రంజన్, ముఖేశ్ మాండవీయతో పాటు యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ తదితరులు పాల్గొన్నారు. 2014 అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ‘స్వచ్ఛ్ భారత్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం మరుగుదొడ్ల నిర్మాణం, పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించడం ప్రధాన లక్ష్యం.