కేరళలోని వయనాడ్‌లో లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ మానవతా మూర్తి మదర్ థెరిసాతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మా నాన్న రాజీవ్ గాంధీ హత్య జరిగిన కొద్ది రోజులకు మదర్ థెరెసా మమ్మల్ని పలకరించడానికి ఇంటికి వచ్చారు. అప్పుడు నాకు 19ఏళ్లు. ఆమె వచ్చిన సమయంలో జ్వరంతో బాధపడుతున్నాను. అమ్మను పలకరించిన అనంతరం థెరెసా నా దగ్గరికి వచ్చి తలపై చేయి పెట్టి ఆశీర్వదించారు. నిరుపేదల కోసం పని చేయాలని నన్ను ఆహ్వానించారు.
దాదాపు 6 సంవత్సరాల తర్వాత నేను వారి సంస్థతో కలిసి పని చేయడానికి వెళ్లాను. అక్కడ ఉన్న సోదరీమణులతో కలిసి బాత్రూంలు శుభ్రం చేయడం, వంట చేయడం వంటి పనులు చేశాను. అప్పుడే కష్టాల్లో ఉన్న వారికి సమాజం ఎలా చేయూతనందిస్తుందో తెలుసుకున్నాను. వారు పడే బాధలను కళ్లారా చూశాను. అదే విధంగా వయనాడ్‌లో కొండ చరియలు విరిగిపడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో మీరు ఒకరికొకరు ఏ విధంగా సహాయపడ్డారో చూశాను. కష్టాల్లో ఉన్న తోటి వారికి సహాయం చేయాలనే మదర్ థెరెసా మాటలను మీరు రుజువు చేశారు” అని ఆమె పేర్కొన్నారు.