లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన ఉగ్రనిధుల కేసు నిందితుడు ఇంజినీర్ రషీద్ ఎంపీగా ప్రమాణస్వీకారం చేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సమ్మతి తెలియజేసింది. దీనిపై ఢిల్లీ హైకోర్టు తుది ఆదేశాలు వెలువరించాల్సి ఉంది.
జమ్మూకశ్మీర్‌కు చెందిన షేక్ అబ్దుల్ రషీద్ అలియాస్ ఇంజినీర్ రషీద్ బారాముల్లా నియోజవర్గం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్రుడిగా పోటీ చేసి, విజయం సాధించారు. నేషనల్ కాన్ఫరెన్స్ నేత, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాపై 2లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్ర కార్యకలాపాలకు నిధులు సమకూర్చారన్న అభియోగాలపై 2019 ఆగస్టులో అరెస్టయ్యారు. ప్రస్తుతం అతడు జైల్లో ఉండటంతో మిగతావారితో పాటు 18వ లోక్‌సభ సభ్యుడిగా ప్రమాణం చేయలేపోయారు. పంజాబ్‌లోని ఖడూర్ సాహిబ్ స్థానం నుంచి వేర్పాటువాది అమృత్‌పాల్ సింగ్ గెలుపొందిన సంగతి తెలిసిందే. అతడు కూడా ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు. అతడు కూడా జైల్లోనే ఉన్నాడు.