Tuesday, October 15, 2024
Homeజాతీయంనవంబర్ నెలలో ఢిల్లీలో కృత్రిమ వర్షాలు

నవంబర్ నెలలో ఢిల్లీలో కృత్రిమ వర్షాలు

Date:

దేశ రాజధాని ఢిల్లీలో గాలి వీచే వేగం తగ్గిపోవడం వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులతో పాటు వాహన కాలుష్యం అధికం కావడం ప్రధాన కారణాలుగా తెలుస్తోంది. అయితే నవంబర్‌లో వాయు కాలుష్యం గరిష్ట స్థాయికి చేరుకునే అవకాశం ఉండటంతో ఆ నెలలో కృత్రిమ వర్షాలు కురిపించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా పర్యావరణశాఖ మంత్రి గోపాల్‌రాయ్‌  పేర్కొన్నారు. వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి ఈ విధమైన చర్యలు తీసుకుంటున్నట్లుగా ఆయన తెలిపారు.

”నవంబర్ 1 నుంచి 15 వరకు రాజధాని ప్రాంతంలో కృత్రిమ వర్షాలు కురిపించేందుకు యత్నిస్తున్నాం. చలికాలంలో వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి 21 పాయింట్ల కార్యాచరణ ప్రణాళికను రూపొందించాం. కృత్రిమ వర్షాలు కురిపించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కేంద్ర పర్యావరణ మంత్రికి లేఖ రాశాం. కేంద్ర సమాధానం కోసం ఎదురు చూస్తున్నాం” అని మంత్రి పేర్కొన్నారు.

2016-2023 మధ్య రాజధాని ప్రాంతంలో వాయు కాలుష్యం 34.6 శాతం తగ్గిందని మంత్రి తెలిపారు. దిల్లీలో నాలుగేళ్లలో దాదాపు రెండు కోట్ల చెట్లను నాటామని, అందువల్లే వాయు కాలుష్యాన్ని తగ్గించగలిగామని చెప్పారు. అత్యధికంగా కాలుష్యం ఉన్న ప్రాంతాలను డ్రోన్ల ద్వారా రియల్ టైమ్ మానిటరింగ్ చేస్తామన్నారు. రాజధాని ప్రాంతంలో కాలుష్యాన్ని పర్యవేక్షించేందుకు పర్యావరణ మంత్రిత్వ శాఖ, రవాణా మంత్రిత్వ శాఖ, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ దిల్లీ, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ సిబ్బందితో సహా 86 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేశామని వెల్లడించారు.