నడుస్తున్న రైలులో 11 ఏళ్ల బాలికపై ఓ వ్యక్తి (34) లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో అతడిని తోటి ప్రయాణికులు చితకబాదారు. దీంతో అతడు ప్రాణాలు కోల్పోయిన ఘటన హమ్‌సఫర్ ఎక్స్ రైలులో లఖ్‌నవూ – కాన్పూర్ మధ్య మంగళవారం రాత్రి జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. మృతుడిని బిహార్‌కు చెందిన రైల్వే కాంట్రాక్టు కార్మికుడు ప్రశాంత్ కుమార్‌గా గుర్తించారు.
రైల్వే అదనపు డీజీ ప్రకాశ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. నిందితుడు బిహార్‌లోని సివాన్‌లో బాధితురాలి కుటుంబంతో పాటు రైలు ఎక్కాడు. బాలికకు బెర్త్ ఆఫర్ చేసి.. ఆమె తల్లి లేని సమయంలో లైంగికంగా వేధించాడు. ఈ విషయాన్ని బాలిక తన తల్లికి చెప్పగా.. ఆమె కుటుంబ సభ్యులకు, ఇతర ప్రయాణికులకు సమాచారం ఇవ్వడంతో వారంతా తీవ్ర ఆగ్రహంతో నిందితుడిని చితకబాదారు. అనంతరం అతడిని కాన్పూర్ సెంట్రల్ స్టేషన్‌లో జీఆర్‌పీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, అతడి ఆరోగ్యం విషమంగా ఉండటంతో పోలీసులు ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మృతి చెందాడు. బాధిత బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని.. ఈ కేసును తదుపరి దర్యాప్తు కోసం లఖ్‌నవూలోని జీఆర్‌పీ స్టేషన్‌కు బదిలీ చేసినట్లు ఏడీజీ తెలిపారు. నిందితుడి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత అంత్యక్రియల కోసం కుటుంబ సభ్యులకు అప్పగించామన్నారు.