దేశ రాజధాని ఢిల్లీకి నూతన ముఖ్యమంత్రిగా ఆతిశీ ప్రమాణ స్వీకారం చేశారు. శనివారం రాజ్ నివాస్‌లో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆమెతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ హాజరయ్యారు.
మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొని, జైలుకు వెళ్లి ఇటీవలే విడుదలై వచ్చిన ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.. సీఎం పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తదుపరి ముఖ్యమంత్రిగా ఆతిశీ పేరును ప్రతిపాదించగా.. ఆప్ ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అంగీకరించడంతో.. తాజాగా ప్రమాణ స్వీకారం నిర్వహించారు. ఆమెతో పాటు తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ముకేశ్ అహ్లావత్, గోపాల్ రాయ్, ఇమ్రాన్ హుస్సేన్, కైలాశ్ గహ్లోత్, సౌరభ్ భరద్వాజ్ కేబినెట్ మంత్రులు ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ముందు వారంతా కేజ్రీవాల్‌ను కలిశారు.