జమ్ముకశ్మీర్ నూతన ముఖ్యమంత్రిగా నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అగ్ర నేత ఒమర్ అబ్దుల్లా ప్రమాణస్వీకారం చేశారు. జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. శ్రీనగర్‌లోని ‘షేర్ యే కశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్’లో ఈ ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వివిధ పార్టీలకు చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
వారిలో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా, లోక్‌ససభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, పీడీపీ అధ్యక్షురాలు, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ, ఆప్ సీనియర్ నేత సంజయ్ సింగ్, సీపీఐ నేత డీ రాజా తదితరులు ఉన్నారు. ఒమర్ అబ్దుల్లా గతంలో కూడా జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత బీజేపీ, పీడీపీ కూటమి అక్కడ అధికారం చేపట్టింది. 2018లో కూటమి సర్కారు కూలిపోవడంతో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత కేంద్రం జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దుచేసింది. అనంతరం ఇప్పుడే తొలసారిగా జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి