కన్నబిడ్డను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తండ్రి.. విచక్షణ కోల్పోయి తన కన్నకూతురినే చంపేయాలనుకున్నాడు. పెద్దనాన్నే దగ్గరుండి మృత్యువుపై ఆ చిన్నారిని గెలిపించాడు. రెండేళ్ల వయసు నుంచే మృత్యువుపై పోరాటం చేసి గెలిచిన ఆ చిన్నారి హర్ట్ టచింగ్ స్టోరీ తెలిస్తే గుండెలు బరువెక్కక మానవు. నల్లొండ జిల్లా నాంపల్లి మండలం రాందాస్ తండాకు చెందిన మెఘావత్ మధు.. నాలుగేళ్ల కిందట భార్యపై అనుమానంతో క్రూరమైన నిర్ణయం తీసుకున్నాడు. భార్యను చంపేసి.. తానూ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అయితే.. ఆ దంపతులకు అప్పటికే రెండేళ్ల కూతురు ఇందుమతి ఉండగా.. విచక్షణ కోల్పోయిన మధు.. తన కుమార్తెపై కూడా చంపేసేందుకు దాడి చేశాడు.
అయితే.. ఆ దాడిలో తీవ్రంగా గాయపడిన ఇందుమతి.. కొనఊపిరితో మృత్యువు నుంచి బయటపడింది. అప్పటి నుంచి.. ఇందుమతి సంరక్షణ బాధ్యతలను తన పెదనాన్నే తీసుకుని.. కంటికి రెప్పలా కాపాడుతూ వస్తున్నాడు. అయితే.. విధి ఎంత కఠినమైనదన్నది.. కొన్ని కొన్ని సంఘటనలు గుర్తు చేస్తుంటాయి. అలాంటి కోవకే చెందుతుంది.. ఇందుమతికి వచ్చిన ఆపద కూడా. అటు.. నాలుగేళ్ల క్రితం తండ్రి దాడిలో చావు అంచులవరకు వెళ్లి బయటపడిన ఆ చిన్నారికి.. గుండెలో రెండు రంధ్రాలు బయటపడ్డాయి.
20 రోజుల క్రితం ఇందుమతికి తీవ్రంగా జ్వరం రావడంతో.. ఆస్పత్రికి తీసుకెళ్లారు. అన్ని పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. ఆ చిన్నారి గుండెలో రెండు రంధ్రాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో.. ఇందుమతి పెదనాన్న నేరుగా నిమ్స్ ఆస్పత్రికి వెళ్లి.. అక్కడి వైద్యులతో మాట్లాడారు. ఆ చిన్నారి పరిస్థితిని గమనించిన వైద్యులు.. ఆమెకు విజయవంతంగా ఆపరేషన్ చేశారు. ఇందుమతికి బుధవారం (సెప్టెంబర్ 25న) రోజున గుండె చికిత్స సక్సెస్ అయినట్టుగా కార్డియోథొరాసిక్ డిపార్ట్ మెంట్ హెడ్ అమరేశ్వరరావు తెలిపారు. దీంతో.. తండ్రి చంపేయ్యాలనుకున్న ఆ చిన్నారిని.. పెద్దనాన్న బతికించినట్టయింది. అయితే.. ఇందుమతికి గుండె చికిత్సను నిమ్స్ వైద్యులు పూర్తి ఉచితంగా నిర్వహించినట్టు సమాచారం.