ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని అరికట్టడంలో ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ విఫలం కావడంపై సుప్రీం కోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది. గాలి నాణ్యత పర్యవేక్షణ, వాయు కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పంట వ్యర్థాలను కాల్చడం విషయంలో.. ఎటువంటి కమిటీలు ఏర్పాటు చేయలేదని, గతంలో కమిషన్ చెప్పినవన్నీ గాల్లో మాటలుగా కనిపిస్తున్నాయని పేర్కొంది. ఈ సందర్భంగా కాలుష్య నియంత్రణకు మరింత చురుకుగా వ్యవహరించాల్సిన అవసరం కమిషన్‌కు ఉందని సూచించింది.
”పంట వ్యర్థాల సమస్యను పరిష్కరించడానికి కనీసం ఒక్క కమిటీ కూడా వేయలేదు. ప్రతి ఏటా ఈ సమస్యను చూస్తుంటే సీఏక్యూఎం చట్టం అమలు కావడం లేదని తెలుస్తోంది. కమిటీలు ఏర్పాటు చేశారా? చట్ట ప్రకారం ఏం చర్యలు తీసుకున్నారో కనీసం ఒక్కటైనా చూపించండి. ఢిల్లీ ఎన్‌సీఆర్ రాష్ట్రాలకు గతంలో చెప్పినవన్నీ గాల్లో మాటలుగానే మిగిలినట్లు కనిపిస్తోంది” అని సీఏక్యూఎంను సుప్రీం ధర్మాసనం నిలదీసింది. కేవలం మీరు మౌన ప్రేక్షకులుగానే మిగిలిపోయారని మందలించింది. సీఏక్యూఎం ఛైర్‌సర్సన్ బదులిస్తూ.. గాలి కాలుష్య కట్టడికి మూడు సబ్ కమిటీలు ఏర్పాటు చేశామని, ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాయని సుప్రీం ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. అరుదుగా జరిగే అలాంటి సమావేశాలతో ఎంత సమర్థంగా పనిచేయగలుగుతున్నారో అర్థమవుతుందోని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. పంట వ్యర్థాలకు సంబంధించి ప్రత్యామ్నాయాలను అమలు చేసేందుకు కృషి చేయాలని, ఆ చర్యలకు సంబంధించి సమగ్ర నివేదికను తమకు అందజేయాలని సీఏక్యూఎంను సుప్రీం కోర్టు ఆదేశించింది.