Saturday, December 7, 2024
Homeజాతీయంకోల్‌కతా ఆసుపత్రిలో 50 మంది సీనియర్‌ వైద్యులు రాజీనామా

కోల్‌కతా ఆసుపత్రిలో 50 మంది సీనియర్‌ వైద్యులు రాజీనామా

Date:

పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా ఆర్‌జీ కర్‌ ఆస్పత్రిలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జూనియర్‌ వైద్యులు చేపట్టిన నిరాహార దీక్షకు సీనియర్‌ వైద్యులు, ఫ్యాకల్టీ సభ్యులు మద్దతు ప్రకటించారు. మంగళవారం ఉదయం 15 మంది సీనియర్‌ వైద్యులు జూడాల నిరాహార దీక్షకు సంఘీభావం ప్రకటించగా.. తాజాగా ఆర్‌జీ కర్‌ ఆస్పత్రిలోని 50 మంది సీనియర్‌ వైద్యులు, బోధనా సిబ్బంది మూకుమ్మడిగా రాజీనామా చేశారు. వీరంతా రాజీనామా పత్రంపై సంతకాలు చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

కోల్‌కతాలోని ఆర్జీ కర్‌ ప్రభుత్వ కళాశాల ఆసుపత్రిలో ఆగస్టు 9న జూనియర్‌ వైద్యురాలిపై హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. బాధితురాలికి న్యాయం చేయాలని వైద్య విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగించారు. సీఎం మమతా బెనర్జీ విజ్ఞప్తి మేరకు ప్రభుత్వంతో చర్చలు జరిపారు. తమ డిమాండ్లను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వడంతో.. 42 రోజుల పాటు కొనసాగిన నిరసనలు విరమించి గత నెల 21న పాక్షికంగా విధుల్లో చేరారు. ఈ క్రమంలోనే తమ భద్రతకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సానుకూల చర్యలు లేవని పేర్కొంటూ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష మంగళవారానికి నాలుగో రోజుకు చేరుకుంది. ఆందోళనల్లో భాగంగా వారు ఈ సాయంత్రం ప్రదర్శన నిర్వహించనున్నారు.