Saturday, December 7, 2024
Homeజాతీయంకాలుష్యంపై దిల్లీ ప్రభుత్వానికి సుప్రీం ఆదేశాలు

కాలుష్యంపై దిల్లీ ప్రభుత్వానికి సుప్రీం ఆదేశాలు

Date:

దేశ రాజధానిలో గాలి నాణ్యతను పెంచేలా నిబంధనలు అమల్లోకి తీసుకురావాలని దాఖలైన పిటిషన్‌పై సోమ‌వారం జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓకా, జస్టిస్‌ అగస్టీన్‌ జార్జ్‌లతో కూడిన బెంచ్‌ విచారణ జరిపింది. ”ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ 300 దాటే వరకు మనం ఎందుకు ఎదురుచూడాలి?” అని అత్యున్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆ సమయంలో తమకు చెప్పకుండా జీఆర్‌పీఏ-4 (గ్రాండ్‌ రెస్పాన్స్‌ యాక్షన్‌ ప్లాన్‌)లో ఎటువంటి సడలింపులూ ఇవ్వొద్దని ఢిల్లీ సర్కారుకు తెలిపింది. ఏక్యూఐ 400 స్థాయి కంటే దిగువకు చేరినా.. స్టేజ్‌ 4 నిబంధనల అమలు ఆపొద్దని చెప్పింది.

ఈ సీజన్‌లో తొలిసారి దిల్లీలో వాయుకాలుష్యం అతి తీవ్రస్థాయి (సివియర్‌ ప్లస్‌)కి చేరింది. దీంతో ప్రభుత్వం జీఆర్‌పీఏ-4 అమల్లోకి తీసుకురావాల్సి వచ్చింది. ది సిస్టమ్‌ ఆఫ్‌ ఎయిర్‌ క్వాలిటీ అండ్‌ వెదర్‌ ఫోర్‌కాస్టింగ్‌ అండ్‌ రిసెర్చి(సఫర్‌) డేటా, ఏక్యూఐ సూచీ ప్రకారం నగరంలోని 481 స్థాయి దాటిపోయింది. 35 కేంద్రాల్లో చాలాచోట్ల 400 కంటే అధికంగా నమోదైంది. ద్వారకాలో ఏకంగా 499 నమోదైంది. సోమవారం ఉదయం కమ్ముకున్న పొగమంచుతో దిల్లీ వాసులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు. గాలిలో ప్రాణాంతాక కాలుష్య కారకాల స్థాయిని కొలిచే పీఎం 2.5 సూచీ అత్యధిక స్థాయికి చేరిందని నివేదికలు వెల్లడిస్తున్నాయి.