Thursday, October 10, 2024
Homeజాతీయంకర్ణాటక హైకోర్టు జడ్జిపై సుప్రీంకోర్టు ఆగ్రహం

కర్ణాటక హైకోర్టు జడ్జిపై సుప్రీంకోర్టు ఆగ్రహం

Date:

ఓ భూ వ్యవహారానికి సంబంధించిన కేసులో హైకోర్టు జడ్జి జస్టిస్‌ వేదవ్యాసాచార్‌ శ్రీశానంద విచారణ చేపట్టారు. ఆ ప్రాంతాన్ని పాకిస్థాన్‌తో పోలుస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే కాక, ఈ కేసును వాదించిన మహిళా న్యాయవాది పైనా తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో ఈ వ్యవహారం సుప్రీంకోర్టు దృష్టికి వెళ్లింది. కోర్టుల్లో న్యాయమూర్తులు చేసే వ్యాఖ్యలపై స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేయాల్సిన అవసరాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం వ్యక్తంచేసింది. కోర్టు కార్యకలాపాలను పర్యవేక్షించడంలో సోషల్‌ మీడియా చురుకైన పాత్ర పోషిస్తున్నప్పుడు.. న్యాయస్థానాల వ్యాఖ్యానాలు చట్టాలకనుగుణంగా మర్యాదపూర్వకంగా ఉండేలా చూడాల్సిన అవసరం ఉందని ధర్మాసనం పేర్కొంది.

”కేసు విచారణ సందర్భంగా కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలపై మీడియాలో వచ్చిన వార్తలపై దృష్టిసారించాం. దీనిపై కర్ణాటక హైకోర్టు నుంచి నివేదిక అడిగాం” అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ పేర్కొన్నారు. ఈ విషయంలో తాము కొన్ని ప్రాథమిక మార్గదర్శకాలను నిర్దేశించవచ్చని చెప్పారు. ఓ భూవ్యవహారంలో యజమాని-అద్దెదారు మధ్య వివాదానికి సంబంధించిన కేసులో కర్ణాటక హైకోర్టు జడ్జి జస్టిస్‌ వేదవ్యాసాచార్‌ శ్రీశానంద చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఇటీవల సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ కేసులో మహిళా న్యాయవాదికి ప్రత్యర్థి వర్గం గురించి చాలా తెలుసని అనిపిస్తోందంటూ.. ఆమెపై జడ్జి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.