Saturday, December 7, 2024
Homeజాతీయంఐరాస‌లో భార‌త్‌కు శాశ్వ‌త స‌భ్య‌త్వం క‌ల్పించాలి

ఐరాస‌లో భార‌త్‌కు శాశ్వ‌త స‌భ్య‌త్వం క‌ల్పించాలి

Date:

భార‌త్‌కు ఐక్యరాజ్య‌స‌మితి భ‌ద్ర‌తా మండ‌లిలో శాశ్వ‌త స‌భ్య‌త్వం క‌ల్పించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ పేర్కొన్నారు. మరింత సమానమైన ప్రపంచ క్రమాన్ని సృష్టించేందుకు అంతర్జాతీయ అత్యున్నత సంస్థల్లో సంస్కరణలు తక్షణ అవసరమని ఉద్ఘాటించారు. రష్యాలోని కజన్‌లో జరుగుతోన్న 16వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు ముగింపు రోజున ప్రసంగించిన ఆయన.. ప్రపంచ క్రమం రూపాంతరం చెందుతున్న తీరుకు బ్రిక్స్‌ ఓ ఉదాహరణ అన్నారు.

”ప్రపంచక్రమం ఎంత తీవ్రంగా రూపాంతరం చెందుతుందో బ్రిక్స్‌ తెలియజేస్తుంది. ఇదే సమయంలో గతంలోని అనేక అసమానతలు కూడా కొనసాగుతున్నాయి. వాస్తవానికి, కొత్త రూపాలను, గుణాలను ఆయా దేశాలు స్వీకరించాయి. అభివృద్ధి వనరులు, ఆధునిక సాంకేతికతలను అందిపుచ్చుకోవడాన్ని మనం చూడవచ్చు. ప్రపంచీకరణ ప్రయోజనాలు అసమానంగా ఉన్న విషయాన్ని గుర్తించాలి” అని ఎస్‌ జైశంకర్‌ పేర్కొన్నారు. కొవిడ్‌ మహమ్మారి, అనేక సంక్షోభాలు గ్లోబల్‌ సౌత్‌పై మరింత భారం మోపాయన్న ఆయన.. ఆరోగ్యం, ఆహారం, ఇంధన భద్రతకు సంబంధించిన ఆందోళనలు తీవ్రంగా ఉన్నాయన్నారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను గుర్తించడంలో ప్రపంచం గణనీయంగా వెనకబడిపోయే ప్రమాదం ఉందని ఎస్‌ జైశంకర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. సమానమైన ప్రపంచ క్రమాన్ని సృష్టించడం కోసం తీసుకోవాల్సిన చర్యలను సూచించిన ఆయన.. అత్యున్నత సంస్థల యంత్రాంగాలను సంస్కరించాలన్నారు. ప్రత్యేకంగా ఐరాస భద్రతా మండలిలోని శాశ్వత, తాత్కాలిక విభాగాల్లో తక్షణ సంస్కరణలు అవసరమని బ్రిక్స్‌ వేదికగా ఉద్ఘాటించారు.