ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి దేశవ్యాప్తంగా మరో 500 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచీలను ప్రారంభించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. దీంతో బ్యాంకు బ్రాంచీల సంఖ్య 23వేలకు చేరుతుందన్నారు. ముంబయిలోని ఎస్‌బీఐ ప్రధాన కార్యాలయం 100వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నిర్మలా సీతారామన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా 1921 నుంచి బ్యాంకు ఎలా విస్తరించిందో గుర్తుచేసుకున్నారు. ”అప్పట్లో మూడు ప్రెసిడెన్సీ బ్యాంకులను విలీనం చేసి ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 1955లో పార్లమెంట్‌లో చట్టం చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మార్చారు. 1921లో 250 బ్రాంచీలు ఉండగా.. ఇప్పుడా సంఖ్య 22,500కు పెరిగింది. వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి మరో 500 బ్రాంచీలు అందుబాటులోకి రానున్నాయి” అని ఆర్థిక మంత్రి వివరించారు.
ప్రస్తుతం ఎస్‌బీఐకి 50 కోట్లకు పైగా కస్టమరన్లు ఉన్నారని, దేశంలోని మొత్తం డిపాజిట్లలో ఈ బ్యాంకు వాటా 22.4శాతంగా ఉందని వెల్లడించారు. డిజిటల్ పెట్టుబడులు కూడా విపరీతంగా పెరుగుతున్నాయన్నారు. రోజుకు 20 కోట్ల యూపీఐ లావాదేవీలను బ్యాంకు నిర్వహిస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా ముంబయి బ్రాంచీ శత వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రూ.100 స్మారక నాణెం ఆవిష్కరించారు. ప్రస్తుతం దేశంలో 43 ఎస్‌బీఐ బ్రాంచీలు శతాబ్దం చరిత్ర కలిగినవేనన్నారు.