ఢిల్లీ ఎర్రకోటలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని అవమానించారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. చివరి నుంచి రెండో వరుసలో ఒలింపిక్ క్రీడాకారుల మధ్య ఉన్న సీటులో ఆయనను కూర్చోపెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కేబినెట్ మంత్రికి సమానమైన హోదా ఉన్న ప్రతిపక్ష నేతకు ప్రాధాన్యత ప్రకారం ముందు వరుసలో సీటు కేటాయిస్తారన్న విషయాన్ని గుర్తు చేసింది. ప్రధాని మోదీ చిల్లర మనస్తత్వానికి ఇదే సాక్ష్యమని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రినాతే విమర్శించారు. ‘చిన్న మనస్తత్వం ఉన్నవారి నుంచి పెద్ద విషయాలు ఆశించడం వ్యర్థం. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని ఐదో వరుసలో కూర్చోబెట్టడం ద్వారా మోదీ తన నిరుత్సాహాన్ని ప్రదర్శించారు. అయితే రాహుల్ గాంధీకి ఎలాంటి పట్టింపులేదు. ప్రజల సమస్యలను ఆయన లేవనెత్తుతూనే ఉంటారు’ అని ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు. అయితే మీరు, మీ ప్రభుత్వానికి ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్య సంప్రదాయాలు, ప్రతిపక్ష నాయకుడి పట్ల ఎలాంటి గౌరవం లేదన్నది ఇది నిరూపిస్తున్నదని మండిపడ్డారు.
కాంగ్రెస్ నాయకుడు వివేక్ తంఖా కూడా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ కార్యక్రమాలను రాజకీయం చేయడానికి రక్షణ శాఖను మీరు అనుమతించలేరంటూ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌పై మండిపడ్డారు. అయితే 2014 తర్వాత ఎర్రకోటలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రతిపక్ష నేత పాల్గొనడం ఇదే తొలిసారి.