ఉగ్రదాడుల మూలాలు పాకిస్థాన్‌లోనే ఉన్నాయని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ తరహా ఘటనలకు పాకిస్థాన్ వీలైనంత త్వరగా ముగింపు పలకాలని సూచించారు. ఇరుదేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొనేలా చర్యలు తీసుకోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. గురువారం బారాముల్లాలోని గుల్మార్గ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిలో ఇద్దరు సైనికులతో సహా నలుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. మూడు రోజుల క్రితం ఆరుగురు భవన నిర్మాణ కార్మికులతోపాటు ఓ వైద్యుడిని ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ ఘటనలను తీవ్రంగా పరిగణించిన అధికార నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ.. సరైన పరిష్కారం కనుగొనేందుకు కేంద్రంతో కలిసి పని చేస్తుందని ఫరూక్ ఈ సందర్భంగా వెల్లడించారు.
ఉగ్రవాద సమస్యకు సరైన పరిష్కారం కనుగొనేంత వరకు రాష్ట్రంలో ఈ తరహా ఘటనలు జరుగుతూనే ఉంటాయి. అమాయక ప్రజలను పాకిస్థాన్ పొట్టన పెట్టుకుంటోంది. గత 30ఏళ్లుగా నేను కళ్లారా చూస్తూనే ఉన్నాను. సామాన్యులతోపాటు ఎంతో మంది సైనికులు అమరులయ్యారు. ఇలా తరచూ దాడులకు పాల్పడితే పాకిస్థాన్‌లో కశ్మీర్ భాగమవుతుందని ఆ దేశం తప్పుడు ఉద్దేశంతో ఉంది. అదెప్పటికీ జరగదు. ముందు వాళ్ల దేశంలోని సమస్యలపై దృష్టి పెట్టుకుంటే మంచిది. మిత్రదేశాలుగా మారేందుకు ఉన్న అవకాశాలపై ఆలోచించాలి. లేదంటే పాక్ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది” అని ఫరూక్ హెచ్చరించారు.