Thursday, October 10, 2024
Homeజాతీయంఇది సుప్రీంకోర్టు.. కాఫీ షాపు కాదు

ఇది సుప్రీంకోర్టు.. కాఫీ షాపు కాదు

Date:

సుప్రీంకోర్టులో లాయ‌ర్‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆయన పదే పదే ‘యా’ అని అనడంపై సీజేఐ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇది కోర్టు.. కాఫీ షాపు కాదు’ అని అన్నారు. ‘యా, యా’ అనడం తనకు ‘అలెర్జీ’గా ఉందన్నారు. ఈ భాషను కోర్టులో అనుమతించబోనని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌ను ప్రతివాదిగా 2018 నాటి పిటిషన్‌లో ఒక న్యాయవాది పేర్కొన్నారు. అయితే ఆర్టికల్ 32 అభ్యర్థన కిందకు ఇది వస్తుందా? మాజీ న్యాయమూర్తిని ప్రతివాదిగా పేర్కొంటూ ఎలా పిల్‌ దాఖలు చేస్తారు? అని సీజేఐ డీవై చంద్రచూడ్ ప్రశ్నించారు.

కాగా, ఆ న్యాయవాది స్పందిస్తూ, ”యా, యా’ అప్పటి సీజేఐ రంజన్ గొగోయ్ క్యురేటివ్ ఫైల్ చేయమని నన్ను అడిగారు’ అని తెలిపారు. ఇంతలో సీజేఐ చంద్రచూడ్‌ కల్పించుకున్నారు. ‘ఇది కాఫీ షాప్ కాదు. యా, యా ఏమిటి. ఇది నాకు చాలా అలెర్జీగా ఉంది. ఈ వ్యక్తీకరణను కోర్టులో అనుమతించలేం’ అని అన్నారు. మరోవైపు జస్టిస్ గొగోయ్ ఈ కోర్టు మాజీ న్యాయమూర్తి అని సీజేఐ డీవై చంద్రచూడ్ గుర్తు చేశారు. ఆయనకు వ్యతిరేకంగా ఇలాంటి పిటిషన్‌ దాఖలు చేయలేరని, అంతర్గత విచారణ కోరడం కుదరదని స్పష్టం చేశారు. ఈ పిటిషన్‌ను రిజిస్ట్రీ పరిశీలిస్తుందని తెలిపారు. ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉన్న జస్టిస్ గొగోయ్ పేరును పిటిషన్ నుంచి తొలగించాలని ఆ న్యాయవాదికి సూచించారు.