Saturday, November 9, 2024
Homeజాతీయంఆమెపై 20సార్ల‌కు పైగా హ‌త్యాయత్నాలు జ‌రిగాయి

ఆమెపై 20సార్ల‌కు పైగా హ‌త్యాయత్నాలు జ‌రిగాయి

Date:

జమ్మూకశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్ లీడర్ ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేశారు. ఆయ‌న‌తో పాటు ప్రమాణం చేసిన మంత్రుల్లో ఒకే ఒక్క మహిళ ఉన్నారు. ఆవిడ పేరు సకీనా ఈటూ. దక్షిణ కశ్మీర్‌కు చెందిన స‌కీనా ఈటూ కుల్గామ్‌ జిల్లాలోని డీహెజ్‌ పోరా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఆమె పీపుల్స్ డెమోక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి గుల్జార్‌ అహ్మద్‌ దర్‌పై 17,449 ఓట్ల మెజార్టీతో గెలుపు దక్కించుకున్నారు. ప్రముఖ రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ఆమె నేషనల్ కాన్ఫరెన్స్‌లో వివిధ హోదాల్లో పనిచేశారు. ఆమె తండ్రి వలీ మోహమ్మద్‌ ఈటూ.. ఈ పార్టీలో కీలకంగా వ్యవహరించారు. జమ్మూకశ్మీర్ అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేశారు. ఆయన 1994లో హత్యకు గురయ్యారు.

ఆ తర్వాత తండ్రి వారసత్వాన్ని అందుకొని ముందుకు సాగుతోన్న ఆమె సోదరుడిని 2001లో ఉగ్రవాదులు బలిగొన్నారు. అప్పుడు ఆమె వైద్యవిద్యను అభ్యసిస్తున్నారు. తండ్రి, సోదరుడి మరణాలతో వెనకడుగు వేయని ఆమె రాజకీయ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఆమెపై కూడా 20 సార్లకు పైగా హత్యాయత్నాలు జరిగాయి. వాటన్నింటిని దాటుకొని.. జమ్మూకశ్మీర్‌ ప్రభుత్వంలో వివిధ హోదాల్లో పనిచేశారు. లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు నిర్వర్తించారు. పర్యాటక శాఖ, విద్యాశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 2008 నుంచి 2014 వరకు సామాజిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు. 53 ఏళ్ల వయసులో తాజాగా కేబినెట్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. జమ్మూకశ్మీర్‌లో ప్రజాదరణ ఉన్న అతి కొద్దిమంది మహిళా నేతల్లో ఈమె ఒకరు. సామాజిక సంక్షేమం, మహిళా సాధికారత, గ్రామీణాభివృద్ధికి సంబంధించిన పలు సమస్యలను పరిష్కరించి ప్రజల మన్ననలు పొందారు.